దేశప్రజలను కరోనా వైరస్ తీవ్రంగా కలవరపెడుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్ హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించి.. వాటిని ఐసోలేట్ చేయడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి.
మర్కజ్ బాంబ్...
దేశవ్యాప్తంగా కేసుల సంఖ్యలో పెరుగుదలకు ముఖ్య కారణం నిజాముద్దీన్ జమాత్ వ్యవహారం. మర్కజ్లో పాల్గొన్న వారు.. వారిని కలిసివారు.. ఇలా ఇప్పటివరకు 9వేల మందిని గుర్తించిన కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు అధికారులు స్పష్టం చేశారు.
నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ వ్యవహారం దిల్లీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగేందుకు కారణమైంది. ఒక్క రోజులోనే 141 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఫలితంగా దిల్లీలో మొత్తం బాధితుల సంఖ్య 293కు, మృతుల సంఖ్య 4కు చేరింది.
అటు మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలోనూ గురువారం కొత్త కేసులు భారీగా వెలుగుచూశాయి. వీటిలో చాలా వరకు కేసులు నిజాముద్దీన్ జమాత్‌తో సంబంధం ఉన్నవే.
గురువారం సాయంత్రం 6గంటలకు చేసిన ప్రకటనలో.. దేశవ్యాప్తంగా 2వేల 069మంది వైరస్ బారిన పడినట్టు కేంద్రం వెల్లడించింది. వైరస్‌తో 53మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది.
లాక్డౌన్ తర్వాత...?
వైరస్ ప్రభావం నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకసారి లాక్డౌన్ ముగిసిన తర్వాత.. ప్రజలు క్రమంగా తిరిగి సాధారణ స్థితికి వచ్చేలా ముఖ్యమంత్రులంతా ఒక ఉమ్మడి నిష్క్రమణ వ్యూహాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన సలహాలు, సూచనలను కేంద్రాలకు పంపాలని కోరారు. మోదీ వ్యాక్యల నేపథ్యంలో 14వ తేదీ అనంతరం.. లాక్‌డౌన్‌ను అంచెలంచెలుగా సడలిస్తారన్న వార్తలు జోరందుకున్నాయి.
ఇదీ చూడండి:- ఎయిమ్స్ వైద్యుడు, గర్భిణి భార్యకు కరోనా