మహారాష్ట రాజకీయ పరిణామాల్లో ఎప్పుడైతే కేంద్రబిందువుగా మారారో అప్పుడే ఓ గట్టి నిర్ణయానికి వచ్చినట్టు అనిపిస్తాయి పవార్ వేసిన అడుగులు. శివసేన, కాంగ్రెస్‌తో కూటమి కట్టినంతవరకు సూత్రధారిలా ఉన్న ఆయన పరిస్థితి అజిత్ పవార్ దెబ్బ తీసినప్పుడు ఒక్కసారిగా దిగాలుగా మారినట్టయింది. ఎన్నో సందేహాలు, అనుమానాలు, విమర్శలూ వచ్చాయి. పార్లమెంట్ లో ప్రధాని మోదీ ఎన్సీపీని ప్రశంసించటం, శరద్ పవార్ నేరుగా ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ అవ్వటం ఇవన్నీ ఆయన అడుగులు ఎటూ? అన్న అనుమానాల చుట్టూ బలమైన చర్చలు సాగాయి. కానీ అవేవి నిజం కాదని నిరూపితం అయ్యాయి ఇప్పుడు.
ఒక సందర్భంలో శరద్ పవార్ కుమార్తె కారణంగా పార్టీలో కుటుంబ పరమైన విబేధాలు ప్రభావం చూపాయన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో పవార్ కుటుంబం.. ఎన్సీపీ చీలిపోయిందంటూ ఎంపీ సుప్రియా సూలే చేసిన వాఖ్యలపై అందరి దృష్టి పడింది. బాబాయ్, అబ్బాయికి పడటం లేదని రాజకీయ వారసత్వం విషయంలో శరద్ పవార్ కుమార్తెకే ప్రాధాన్యం ఇస్తున్నారని అందుకే అజిత్ పవార్ వేరుకుంపటి పెట్టినట్టు చెప్పుకున్నారు. ఈ విషయంలో శరద్ పవార్ మాత్రం ఎలాంటి వాఖ్యలు చేయలేదు. తనవాడైన అబ్బాయిని మానసికంగా ఏమాత్రం దూరం చేసుకోలేదు.
డబుల్‌గేమ్ అనుమానాలు
నిజానికి భాజపాకు ఎప్పుడైతే అజిత్ పవార్ మద్దతిచ్చారో అప్పుడే శరద్ పవార్ డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ బహిరంగంగానే చెప్పింది. కానీ అక్కడే శరద్‌పవార్ చాలా ధ్రుడంగా వ్యవహరించారు. మొదటగా అజిత్‌పవార్ నిర్ణయం వ్యక్తిగతం అని విస్పష్ట ప్రకటన చేయటం ద్వారా మిగిలిన సభ్యులు చేజారిపోకుండా జాగ్రత్త వహించారు. అనూమానపు చూపులను ఏమాత్రం లెక్క చేయకుండా... తాను ఎట్టి పరిస్థితుల్లో భాజపాకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తెల్చి చెప్పేశారు.
వ్యూహ చతురత
ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా మహా బల ప్రదర్శనకూ దిగారు శరద్‌పవార్. వియ్ ఆర్ 162 అంటూ తన బలాన్ని అందరి ముందు ప్రదర్శనకు పెట్టారు. అప్పటికే తనదైన వ్యూహాలతో అబ్బాయిని సముదాయించే ప్రయత్నాలు చేస్తునే... విసిరిన ఈ బల ప్రదర్శన గట్టి ప్రభావమే చూపించింది. అదే ఫడణవీస్ సర్కారును మూణ్నాళ్ల ముచ్చట చేసింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో చేయించిన ప్రమాణాలు... మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని పిలుపిస్తూ ప్రయోగించిన మరాఠా ఆత్మగౌరవం నినాద ఆయుధం... అద్భుతంగా పని చేసింది.
ఇది మహారాష్ట్ర...
నిజానికి మహాబల ప్రదర్శనలో ఎంతమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారన్న దానిపై కచ్చితమైన సంఖ్య లేనప్పటికీ తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ నేత చవాన్ చెప్పినందున మొత్తం పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు మెజారిటీ నిరూపించుకోగలమన్న ధీమాలో ఉన్న భాజపాకు ఈ పరిణామాలు మింగుడు పడలేదు. చివరకు వారు ఊహించని రీతిలో పరిణామాలు మారిపోయాయి. ఈ సందర్భంలోనే కర్ణాటక, గోవా, మణిపూర్ ఉందంతాలనూ గుర్తు చేశారు పవార్. మెజారిటీ లేకపోయినా అక్కడ భాజపా ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, అయితే ఇది గోవా కాదు మహారాష్ట్ర అని తెలుసుకోవాలని భాజపాను పరోక్షంగా హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే తన రాజకీయ పాచికలు విసిరి భాజపా ఆశల్ని అడియాశలు చేశారు.
మొత్తంగా చూస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో ఆరంభం నుంచి తనదైన శైలిలో వ్యుహాలు నెరపుతూ వచ్చిన శరద్ పవార్ ఈసారి దాన్ని మరింత రక్తి కట్టించారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ కూటమికి చివరి నిమిషంలో ఎలాగైతే భాజపా ఝలక్ ఇచ్చిందో అదే తరహాలో శరద్ పవార్ కూడా భాజపాకు షాక్ ఇచ్చారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చాలా చూశారు శరద్ పవార్. కష్టాలు ఎదురయినా.. అవన్నీ తాత్కాలికమేనని అంటారు. ప్రజలు తన వెంట నిలబడితే చాలని చెప్పే ఆయన ఈసారి మరాఠాల ఆత్మగౌరవం నినాదంతోపాటు తన 50 ఏళ్ల రాజకీయ జీవితసారాన్ని సమస్య పరిష్కారానికి వినియోగించుకున్నట్టు కనిపిస్తోంది.