మిషన్ శక్తి పేరిట ఈ ఉదయం యాంటీ శాటిలైట్ వెపన్(ఏ-శాట్)ను పరీక్షించారు శాస్త్రవేత్తలు. జనవరి 24న ఇస్రో ప్రయోగించిన మైక్రో ఉపగ్రహాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. శాస్త్రవేత్తలు కమాండ్ ఇచ్చిన వెంటనే... ఏ-శాట్ క్షిపణి ఒడిశా చాందీపూర్‌లోని అబ్దుల్ కలాం ఐలాండ్ లాంచ్ కాంప్లెక్స్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 300కిలోమీటర్ల దూరంలోని ఉపగ్రహాన్ని కూల్చేసింది. ఈ ప్రక్రియ మొత్తం 3 నిమిషాల్లోనే పూర్తయింది.
ఉపగ్రహ వ్యతిరేక సాంకేతికత ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే సొంతం. ఇప్పుడు భారత్ వాటి సరసన చేరింది. ఈ చారిత్రక విజయాన్ని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ అత్యాధునిక సాంకేతికత దేశ రక్షణ బలోపేతం కోసమేనని స్పష్టం చేశారు.
"ఈ ప్రయోగంలో ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలు, ఒప్పందాలను ఉల్లంఘించలేదు. అత్యాధునిక సాంకేతికత ఉపయోగించుకుని దేశంలోని కోట్లాది మంది ప్రజల భద్రత, అభివృద్ధే లక్ష్యంగా మేం పనిచేస్తాం. ఈ రంగంలో శాంతి నెలకొల్పడమే మా లక్ష్యం. అంతేగానీ యుద్ధ వాతావరణం తీసుకురావటం మా ఉద్దేశం కాదు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
బీఎండీ మిసైల్...
శత్రువు ఉపగ్రహాలను నేలమట్టం చేసేందుకు భారత్ రూపొందించిన ఆయుధం పేరు... 'బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) ఇన్టర్సెప్టార్.'
ఇందులోని రాడార్ అంతరిక్షంలో ఉన్న లక్ష్యాన్ని గుర్తిస్తుంది. శాటిలైట్ కదలికలను పసిగడుతుంది. మిసైల్ లాంచ్ అయ్యాక శరవేగంగా నింగిలోకి దూసుకుపోతుంది. శత్రువు ఉపగ్రహాన్ని తునాతునకలు చేస్తుంది.
ఎందుకు అవసరం...?
శత్రుదేశాలు నిఘా కోసం దిగువ భూకక్ష్య ఉపగ్రహాలు ఉపయోగించే అవకాశముంది. ఆయా దేశాలు ఏమైనా క్షిపణులను ప్రయోగించినా... వాటికి ఉపగ్రహాలే మార్గదర్శనం చేస్తాయి. అలాంటి శాటిలైట్లను కూల్చివేసి, శత్రువుల కుట్రల్ని భగ్నం చేసేందుకు ఉపగ్రహ వ్యతిరేక సాంకేతికత ఎంతో అవసరం.
మోదీ అభినందన...
ఏ-శాట్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని కలిశారు. ప్రయోగం విజయవంతం కావడంపై అభినందనలు తెలిపారు. భారత్ ఎందులోనూ తక్కువ కాదన్న సందేశాన్ని ప్రపంచ దేశాలకు పంపారని కొనియాడారు మోదీ.