ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయ దుమారానికి కారణమైన సెక్స్ సీడీ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు స్వల్ప ఊరట లభించింది. కేసుకు సంబంధించిన తదుపరి విచారణపై స్టే విధించింది సుప్రీంకోర్టు.
సెక్స్ సీడీ కేసుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చినందుకు తమను బెదిరించారని ఇద్దరు సాక్షులు ఫిర్యాదు చేసినట్లు సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సీబీఐ వినతిపై స్పందించాలని ముఖ్యమంత్రి బఘేల్‌కు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.
2018లో కేసు నమోదు..
సెక్స్ సీడీ కేసు 2018 నాటిది. అప్పుడు బఘేల్... ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు. నకిలీ సెక్స్ సీడీని అడ్డంపెట్టుకుని బఘేల్ తనను అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారని అప్పటి రాష్ట్ర మంత్రి, భాజపా నేత రాజేశ్ మునత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 2018 సెప్టెంబర్‌లో సీబీఐ బఘేల్‌పై కేసు నమోదుచేసింది.
ఇదీ చూడండి: ఓటేసేందుకు హరియాణా సీఎం 'ఆకర్ష' ప్రయాణం