ఎన్నో ఏళ్ల నుంచి ముస్లిం మహిళలు చేస్తోన్న పోరాటానికి, ముస్లిం మహిళల రక్షణ బిల్లు ఆమోదం పొందేలా చేయడానికి మోదీ ప్రభుత్వం చూపిన పట్టుదలకు ఎట్టకేలకు విజయం చేకూరింది. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.
ఇదివరకే లోక్‌సభలో ఆమోదం లభించగా.. తాజాగా రాజ్యసభలో బిల్లు పాసయింది. ఓటింగ్ నిర్వహించగా 99-84 తేడాతో బిల్లు ఎగువసభ దాటింది. ఉభయసభల ఆమోదంతో.. బిల్లు ఇప్పుడు చట్టరూపం దాల్చనుంది.
అసలేంటీ ముమ్మారు తలాక్? ముస్లింల సంప్రదాయంలో భాగంగా చెప్పే ఆ విధానాన్ని... ముస్లిం మహిళలు ఎందుకు వ్యతిరేకించారు...? ఎలాంటి పోరాటం సాగించారు...? వారి విజయంలో మోదీ ప్రభుత్వం పాత్ర ఎంత?
"లింగ సమానత్వం..!" పురుషాధిక్య ప్రపంచంలో.. తరచూ వినిపించే మాట. మహిళా సాధికారత కోసం ఎంతో చేస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సరైన మార్పు కనిపించని దుస్థితి. అయితే... తమది చేతల ప్రభుత్వమేనని నిరూపిస్తూ... కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కీలక అడుగు వేసింది. తరతరాలుగా ముస్లిం మహిళల పాలిట శాపంగా నిలిచిన ముమ్మారు తలాక్ విధానం ఆట కట్టించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా... ముమ్మారు తలాక్ విధానాన్ని నేరంగా పరిగణించేలా చారిత్రక అడుగువేసింది.
దాదాపు 1400 ఏళ్ల నుంచి ఆచరిస్తున్నట్లు చెబుతున్న ముమ్మారు తలాక్ విధానం వల్ల... దేశంలో చాలామంది ముస్లిం మహిళలు ఆకస్మిక, మౌఖిక, కోర్టు వెలుపలి విడాకులకు గురవుతున్నారు. ఫోన్ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో.. వాట్సాప్, స్కైప్, ఫేస్‌బుక్, వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా కూడా తలాక్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఉదంతాలు అనేక మంది ముస్లిం మహిళల జీవితాల్ని క్షణాల్లోనే తలకిందులు చేశాయి. మరెంతో మందికి ప్రశాంతతను దూరం చేశాయి. భర్త వచ్చి... ఎప్పుడు ముమ్మారు తలాక్ చెబుతాడోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన ముస్లిం మహిళలు ఎందరో.
తలాక్ అంత సులువా..
నిజానికి... తలాక్ చెప్పడం అంత సులువైన విషయం ఏం కాదు. ఇస్లామిక్ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించేవాళ్లు మాత్రమే ముందూ వెనుక ఆలోచించి తలాక్ చెప్పాల్సి ఉంటుంది. 3 సార్లు తలాక్ చెప్పటం అన్నది... ఇద్దరి మధ్య ఏ సమయంలో అయినా మళ్లీ సయోధ్య కుదిర్చేందుకోసమే. అందుకు కనీసం 90 రోజుల పాటు వ్యవధి ఉంటుంది. అన్ని రోజులూ సయోధ్యకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాతే తలాక్ చెప్పాలి.
వాస్తవానికి పురుషులకు తలాక్ చెప్పే ఆచారం ఉన్నట్టుగా మహిళలకూ ఆ హక్కు ఉంది. కానీ ఆ హక్కును వినియోగించుకోవడంలో వారిది ఎప్పుడూ వెనుకబాటే. అదీకాక అక్కడ ఆడవాళ్లు చెప్పే తలాక్‌కు భర్త అంగీకారం తప్పనిసరి. ఓ విధంగా ఇక్కడ పురుషాధిక్యమే కాబట్టి వందల ఏళ్ల నుంచి సాగుతున్న ఈ ఆచారానికి... ముస్లిం మహిళలే బాధితులు.
అలుపెరుగని పోరాటం...
మగవారి ఆధిపత్య ధోరణికి అద్దంపట్టేలా ఉందంటూ తలాక్ అంశంపై ఆరు దశాబ్దాలుగా గళమెత్తుతూనే ఉన్నారు దేశంలోని ముస్లిం మహిళలు. భర్తకు ఎప్పుడూ నచ్చకపోయినా వెంటనే 3 మార్లు తలాక్ చెప్పి భార్యను వదిలించుకునే తీరుకి వ్యతిరేకంగానే వీరి పోరాటం. తలాక్ బాధితులైన సైరో బానో, ఇష్రత్ జహాన్ సహా మరికొందరు మహిళలు.... ఆ విధానంపై విస్తృత పోరాటం సాగించారు. ముస్లిం మహిళల హక్కులు పరిరక్షించాలంటూ.... సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఇలాంటి వారికి అండగా నిలిచింది. మరెవ్వరూ తలాక్ విధానానికి బాధితులు కారాదన్న ఉద్దేశంతో... చారిత్రక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో, మరే ప్రభుత్వమూ చేయని రీతిలో... తలాక్ విధానానికి వ్యతిరేకంగా గళమెత్తింది. లింగ సమానత్వం, లౌకికవాదం విలువల్ని దృష్టిలో ఉంచుకుని... ముమ్మారు తలాక్ విధానం కొనసాగింపు పునఃసమీక్షించాలని 2016 అక్టోబరు 7న సుప్రీంకోర్టుకు నివేదించింది.
చారిత్రక తీర్పు...
ముమ్మారు తలాక్ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో.... ముస్లిం మహిళల పోరాటానికి మరింత ఊతం లభించింది. ఈ వ్యవహారంలో విచారణ కోసం... ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు 2017 ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు ప్రకటించింది. మే నెలలో... రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. తలాక్ విధానం మతపరమైందని, ఆ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం తగదన్న 'అఖిల భారత ముస్లిం పర్సనల్‌లా బోర్డు' వాదనలు, బాధిత మహిళల విషాద గాథలు, కేంద్ర ప్రభుత్వ నివేదనల్ని విన్న సుప్రీంకోర్టు 2017 ఆగస్టు 22న చారిత్రక తీర్పునిచ్చింది.
ముస్లింలలో మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చే పద్ధతి చట్టవ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చిచెప్పింది. ఖురాన్ మూల సూత్రాలకూ.... ముమ్మారు తలాక్ పూర్తి విరుద్ధమని స్పష్టంచేసింది. తలాక్ విధానంపై 6 నెలల్లో చట్టం చేయాలని పార్లమెంటుకు సూచించింది. ఆ మేరకు ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు రూపొందించింది. రాజకీయపరమైన సవాళ్లను అధిగమించి పార్లమెంటు ఉభయసభల ఆమోదం పొందింది.