అయోధ్యలో చారిత్రక రామ మందిర నిర్మాణం కోసం భారీఎత్తున విరాళాలు పోగవుతున్నాయి. శివసేన పార్టీ తరఫున రూ.1కోటి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ. 11లక్షలు నిధులిచ్చినట్టు రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం తెలిపారు.
ఆలయం కోసం విరాళాలు సేకరించేందుకు.. 2020 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు 'శ్రీరామ్ మందిర్ నిధి సమర్పణ్'ను చేపడతామని రాయ్ తెలిపారు. రామ జన్మభూమిలో నిర్మించే ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా.. ప్రతి భక్తుడూ తన వంతు సాయమందించాలని ఆయన కోరారు. దీని కోసం విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరిస్తారని స్పష్టం చేశారు రాయ్.
విదేశీయుల ద్వారా నిధులను సమకూర్చేందుకు కేంద్రం నుంచి తమకు అనుమతి లేనందున కేవలం దేశీయ విరాళాలనే ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తామని ఇటీవలే చెప్పారు రాయ్. అయితే.. ఈ విరాళాల సేకరణలో ఎలాంటి నిర్దేశిత లక్ష్యం లేదని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జనవరి 26న అయోధ్య మసీదుకు పునాది