ఒకప్పుడు ఇంట్లో కొళాయి కాని, మిక్సీలు, గ్రైండర్లు కాని చెడిపోతే వీధిచివర మరమ్మతు దుకాణం పెట్టుకున్న ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లను పిలిచి బాగు చేయించేవాళ్లం. ఇప్పుడు అర్బన్ క్లాప్, జస్ట్ డయల్, సులేఖా వంటి సంస్థలను ఆన్‌లైన్‌లో సంప్రతించగానే ఆ నిపుణులు నేరుగా మన ముంగిటే వాలుతున్నారు. వడ్రంగులు, ఇంట్లో బూజు దులిపేవారు కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నారు. గతంలో ఎక్కడికైనా వెళ్లడానికి కారు కోసం ట్రావెల్ సర్వీసువారిని సంప్రతిస్తే డ్రైవర్‌తో వాహనాన్ని పంపేవారు. ఇప్పుడు ఓలా, ఉబర్‌లకు స్మార్ట్‌ఫోన్‌లో కబురంపితే చాలు, పని జరిగిపోతోంది. చిటికె వేస్తే చాలు స్విగీ, జొమాటో వంటి సంస్థలు అల్పాహారాన్ని, భోజనాలను మన డైనింగ్ టేబుల్ మీదకు చేర్చుతున్నాయి. అంతా అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్ల మహిమ!
ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చి నిర్దిష్ట మొత్తానికి చిన్న చిన్న పనులు చేసిపెడుతున్న వ్యక్తులను అమెరికాలో ‘గిగ్ వర్కర్స్ అంటారు. భారత్‌లోనూ వ్యక్తిగత రవాణా, ఆహార సరఫరా వ్యాపారాల్లో ‘గిగ్ వర్కర్ల’ సందడి పెరిగిపోతోంది. ఇంటింటికి ఆహార రవాణా కోసం 2.10 లక్షలమంది బట్వాడా కుర్రాళ్లను నియమించిన స్విగీ, మరో ఏడాదిన్నరలో వీరి సంఖ్యను అయిదు లక్షలకు పెంచుతానని ప్రకటించడం దీనికి నిదర్శనం. ఉబర్, ఓలా వంటి వ్యక్తిగత రవాణా సంస్థల కింద 15 లక్షలమంది డ్రైవర్లు పనిచేస్తున్నారని అధ్యయనాలు తెలిపాయి.
నైపుణ్యాలే పెట్టుబడి
తక్కువ నైపుణ్యాలతో పని పూర్తిచేసే డ్రైవర్లు, ప్లంబర్లు, బట్వాడా కుర్రాళ్లే కాకుండా అత్యున్నత నైపుణ్యాలున్న సాంకేతిక సిబ్బందీ కాంట్రాక్టు మీద లభ్యమవుతున్నారు. ప్రాజెక్టులవారీగా పనిచేసే ఈ ప్రతిభావంతులను ఫ్లెక్సి వర్కర్లు, ఫ్రీలాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎనలిటిక్స్, ఆటోమేషన్, ఐటీ ఆర్కిటెక్చర్, కృత్రిమ మేధ వంటి హైటెక్ రంగాల్లో ఫ్లెక్సి వర్కర్ల సేవలను టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి ఐటీ దిగ్గజాలు ఉపయోగించుకుంటున్నాయి. 2018లో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో అయిదు లక్షలుగా ఉన్న ఫ్లెక్సి వర్కర్ల సంఖ్య; 2021కల్లా 7.20 లక్షలకు చేరుతుందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎఫ్) తెలిపింది. భారత్‌లో 2018కల్లా అన్ని రంగాల్లో 33 లక్షలకు చేరిన గిగ్, ఫ్లెక్సి వర్కర్ల సంఖ్య, 2021నాటికి 61 లక్షలకు పెరగనుందని ఐఎస్‌ఎఫ్ తెలిపింది. వారిలో 55 శాతం బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు, ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో పనిచేస్తారు. ఫ్లెక్సి లేదా ఫ్రీలాన్స్ ఉద్యోగాల కల్పనలో అమెరికా, చైనా, బ్రెజిల్, జపాన్‌ల తరవాత స్థానాన్ని భారతదేశమే ఆక్రమిస్తోంది.
హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సి వర్కర్ల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని ఐఎస్‌ఎఫ్ లెక్కవేసింది. ఇప్పటికే 70 శాతం భారతీయ కంపెనీలు ఏదో ఒక సమయంలో గిగ్-ఫ్రీలాన్స్ వర్కర్ల సేవలను ఉపయోగించుకున్నట్లు ఒక సర్వేలో తెలిపాయి. 2018లో ప్రపంచ గిగ్/ ఫ్లెక్సి మార్కెట్ పరిమాణం 20,400 కోట్ల డాలర్లకు చేరుకోగా అందులో 50 శాతం వాటాను రవాణా సేవలు ఆక్రమించాయి. 2023కల్లా ఈ మార్కెట్ 45,500 కోట్ల డాలర్లకు చేరనుంది. భారత్‌లో ఫ్రీలాన్సర్ మార్కెట్ 2025నాటికి దాదాపు 3,000 కోట్ల డాలర్లకు (రూ.2.10 లక్షల కోట్లకు) చేరవచ్చు. నేడు ప్రపంచంలో ప్రతి నలుగురు ఫ్రీలాన్సర్లలో ఒకరు భారత్‌కు చెందినవారే. హైటెక్ రంగంలో మొదట అంకుర సంస్థల వల్ల ఫ్లెక్సి వర్కర్లు విస్తరించారు. వీరి సేవలు చౌకగా లభిస్తాయనుకుంటే పొరపాటు.
ప్రతిభావంతులైన ఫ్రీలాన్సర్లు ఏడాదికి 20 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఆర్జిస్తున్నారని పేపాల్ సంస్థ తెలిపింది. గిగ్/ఫ్లెక్సి వర్కర్లు అందరికీ ఇంత భారీ ఆదాయాలు లభించకపోవచ్చు. గణనీయ సాంకేతిక నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. వారికి వెబ్, మొబైల్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైనింగ్, ఇంటర్నెట్ రిసెర్చ్, డేటా ఎంట్రీలలో కాంట్రాక్టుపై పనులు లభిస్తున్నాయి. సాంకేతిక అర్హతలు లేకపోయినా సృజనాత్మకత ఉంటే చాలు- రకరకాల తాత్కాలిక పనులు చేసుకోవచ్చు. ఉద్యోగ దరఖాస్తులు రాయడం, వార్తలు, వ్యాసాలు రాయడం (కంటెంట్ రైటింగ్), ఆన్‌లైన్ భరతనాట్యం కోర్సులు, ట్యూషన్లు, ఆయుర్వేద, హోమియో సేవలు అందించడం ద్వారా మున్ముందు చక్కని మొత్తాలు అందుకోవచ్చు.
మరి ఉద్యోగ భద్రత?
‘గిగ్ వర్కర్ల’కు ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, ఉద్యోగ విరమణానంతర ప్రయోజనాలు ఉండవనే మాట నిజం. కానీ, ఆకలిగొన్నవాడికి పచ్చడి మెతుకులే పరమాన్నమన్నట్లు ఉపాధి కల్పన అడుగంటిపోయిన ఈ రోజుల్లో తాత్కాలిక ఉద్యోగమే పరమౌషధమవుతోంది. పెద్దగా నైపుణ్యాలు లేని నిరుద్యోగులు ‘గిగ్’ ఉద్యోగాలతో సరిపెట్టుకొంటున్నది ఇందుకే. అదీకాకుండా తమ వెసులుబాటునుబట్టి ‘గిగ్’ ఉద్యోగం చేయవచ్చు లేక మానేయవచ్చు కూడా. ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక మోస్తరు ఆదాయం కళ్లజూడవచ్చు. ముంబయి, బెంగళూరు నగరాల్లో స్విగీ, జొమాటో, ఉబర్, ఓలా వంటి సంస్థల కింద ‘గిగ్’ ఉద్యోగాలు చేసేవారిలో గ్రామాల నుంచి వలస వచ్చినవారు ఎక్కువ. వారి సంపాదనలో కొంత మిగుల్చుకుని ఇళ్లకు పంపుతున్నారు. చాలామంది రుణాలపై కార్లు కొనుక్కుని ఉబర్, ఓలాలకు తిప్పుతున్నారు. అయితే రుణకిస్తీలు, ఇంటి ఖర్చులు పోగా వారికి చేతిలో మిగిలేది తక్కువ. ఉబర్ చెల్లిస్తున్న అరకొర వేతనాలకు నిరసనగా 2018లో డ్రైవర్లు సమ్మె చేశారు కూడా.
ఎక్కువ సంపాదన కోసం తాత్కాలిక ఉద్యోగులు పదేపదే ఉద్యోగాలు మారుతున్నారు. డిజిటల్ వేదికలు (ప్లాట్‌ఫామ్‌లు) వారికి తోడ్పడుతున్నాయి. వస్తుసేవల అమ్మకాల(సేల్స్) సిబ్బంది అన్ని వ్యాపారాలకు చాలా అవసరం. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా సేవలు (బీఎఫ్‌ఎస్‌ఐ), శీఘ్రంగా విక్రయమయ్యే వినియోగ వస్తువులు (ఎఫ్‌ఎమ్‌సీజీ), ఫార్మా కంపెనీలు సేల్స్ సిబ్బందిని విరివిగా నియోగిస్తాయి. వీరిలో అత్యధికులు ద్విచక్రవాహనంపై తిరుగుతూ అమ్మకాలు సాగించే యువకులు. 20-29 ఏళ్ల వయోవర్గంలోని ఈ యువజనులు నేడు ఇతర రంగాల్లో ‘గిగ్’ పనుల పట్ల ఆకర్షితులవుతున్నారు. కొంతకాలం పనిచేశాక 20 నుంచి 45శాతం యువ విక్రయ సిబ్బంది ‘గిగ్’ ఉద్యోగాల్లోకి మళ్లుతున్నారని అంచనా. మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ (ఏఐ)లను ఉపయోగించి ‘గిగ్’ ఉద్యోగాలకు తగిన సిబ్బందిని వెతికిపెట్టే డిజిటల్ కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. 2018లో ప్రారంభమైన హలోవెరిఫై కంపెనీ ఓలా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్‌తో సహా 110 కంపెనీల్లో తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన 50 లక్షల మంది అభ్యర్థుల పూర్వాపరాలను తనిఖీ చేశామని ప్రకటించింది. గతంలో రోజులు పట్టే తనిఖీ ప్రక్రియను ఆధునిక సాంకేతికతతో నిమిషాల్లోనే పూర్తిచేయగలుగుతోంది.
అసంఘటిత రంగమే ఆదరుపు
భారత్‌లో ఏటేటా పెరుగుతున్న యువజనాభా సంఘటిత రంగంలో శాశ్వత ఉద్యోగాలు కోరుకుంటుంటే, 56 శాతం కొత్త ఉద్యోగాలు తాత్కాలిక, పరిమిత కాల ప్రాతిపదికపైనే లభ్యమవుతాయని అంచనా. సాంకేతికత వల్ల సంఘటిత రంగ ఉద్యోగాలు సైతం అసంఘటిత రంగ ఉద్యోగాలుగా మారిపోతున్నాయి. కాంట్రాక్టుపై నియమించే తాత్కాలిక ఉద్యోగులకు సెలవులు, ఓవర్ టైమ్ చెల్లింపులు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత ఉండవు. ప్రస్తుత కార్మిక చట్టాలు వీరి గురించి పట్టించుకోవడం లేదు. దీన్ని వాటంగా తీసుకుని కంపెనీలు ఖర్చు తగ్గించుకోగలుగుతున్నాయి.
కొత్త తరహా తాత్కాలిక కార్మికుల స్థితిగతులను మెరుగుపరచాలని గతేడాది డిసెంబరు 11న లోక్‌సభలో ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా స్మృతి (కోడ్) సంకల్పిస్తోంది. వ్యాపార సంస్థలు నేరుగా నియోగించే ఒప్పంద సిబ్బందిని ‘గిగ్ వర్కర్లు’గా, ఆన్‌లైన్ వేదికల ద్వారా నియోగించే ఉబర్ డ్రైవర్లు, జొమాటో బట్వాడా కుర్రాళ్లను ‘ప్లాట్‌ఫాం వర్కర్లు’గా ఈ స్మృతి వర్గీకరిస్తోంది. వీరికి జీవిత, ప్రమాద బీమా, ఆరోగ్య, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్యంలో ఆసరా తదితర సౌకర్యాలు అందించాలని కేంద్రానికి సూచించింది. వీరికోసం సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేసే అవకాశమూ ఉంది. కానీ, ‘గిగ్’, ‘ప్లాట్‌ఫాం వర్కర్ల’కు కనీస వేతనాలను, సెలవు దినాలను, అస్వస్థత కాలంలో చెల్లింపును, ఉన్నపళాన పనిలోనుంచి తొలగించకుండా నివారించే నిబంధనలను ఈ స్మృతిలో పొందుపరచక పోవడం పెద్దలోటు.
ఉబర్ తదితర సంస్థలకు వేతనం మీద పనిచేసే కాంట్రాక్టు పనివారిని కూడా సాధారణ ఉద్యోగుల్లానే పరిగణించాలంటూ అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రం ఓ బిల్లును ఆమోదించింది. ‘గిగ్ వర్కర్ల’కు కనీస హక్కులు కల్పించాలని ఐరోపా సమాఖ్య (ఈయూ) ఒక ఉత్తర్వు జారీ చేసింది. వీటిని మన సామాజిక భద్రతా స్మృతి ఆదర్శంగా తీసుకోవాలి.
ఇదీ చదవండి:పీజీ పట్టభద్రుడి భిక్షాటన.. ఎందుకో తెలుసా?