ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బిహార్ రాజధాని పట్నాలో జన జీవనం స్తంభించింది. గురువారం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బోట్లతోనే వీధుల్లో ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో వరదల పరిస్థితిని అద్దం పడుతున్న చిత్రాలను ఈటీవీ భారత్ సేకరించింది.
వస్త్ర దుకాణంలో..
పట్నాలోని ఓ వస్త్ర దుకాణంలోకి వరద నీరు చేరిన చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులోని బట్టలన్నీ తడిసిపోయి తీవ్ర నష్టం ఏర్పడింది.
రిక్షా..
భారీ వర్షాలతో రాజేంద్ర నగర్లో సుమారు 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఓ రిక్షా వరదలో చిక్కుకుపోయింది. దానిని తీసేందుకు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది.
నలంద వైద్య కళాశాల
నలంద వైద్య కళాశాల, ఆస్పత్రి పరిసరాలు చెరువును తలపిస్తున్నాయి. మందులు, అత్యవసర, శిశువు చికిత్స విభాగాలు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. ఆస్పత్రిలోకి నీరు చేరి రోగులు, వారి బంధువులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గాంధీ మైదానం..
నగరంలోని గాంధీ మైదానం, దాని పరిసర ప్రాంతాలు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. రోడ్లపై నిలిపిన వాహనాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి.
జేసీబీ సాయంతో..
పట్నాలోని ఓ కళాశాల విద్యార్థినులు వరద నీటిలో చిక్కుకుపోయారు. జేసీబీ సాయంతో బాలికలను సురక్షితంగా రక్షించారు. చాలా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను జేసీబీల సాయంతో కాపాడారు.
3 అడుగలు మేర..
పట్నాలో ఓ ఆస్పత్రి వార్డుల్లో సుమారు 3 అడుగుల మేర వరద నీరు చేరింది. దీని కారణంగా ఎత్తైన బల్లలపై రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
అశోక్ నగర్..
అశోక్ నగర్ ప్రాంతంలో ఇళ్ల ముందు వరద నీరు చేరి చెరువును తలపిస్తోంది. ఇంటి నుంచి బయటకు రావటానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదీ చూడండి: బోల్తా పడ్డ బస్సు- ఏడుగురికి గాయాలు