దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను కర్ణాటక పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. పుల్వామా ఘటన జరిగి ఏడాదైన సందర్భంగా పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వీరిని హుబ్లీ పోలీసులు గత శనివారమే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శిక్షా స్మృతి(కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్) సెక్షన్-169 ప్రకారం పూచీకత్తుపై వదిలేశారు.
అయితే.. విద్యార్థుల విడుదలకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. పలు అతివాద సంస్థలు హుబ్లీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వారిని మళ్లీ ఇవాళ అదుపులోకి తీసుకొని.. కోర్టు ముందు హాజరుపర్చారు. ప్రస్తుతం ముగ్గురూ జ్యుడీషియల్ కస్టడీ రిమాండ్‌లో ఉన్నారని వివరించారు హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ దిలీప్.
ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై సైతం ఈ కేసు గురించి పోలీసు అధికారులను ఆరా తీసినట్లు సమాచారం.
పాకిస్థాన్‌కు అనుకూలంగా...
కశ్మీర్‌కు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర దాడి జరిగి ఏడాదైన సందర్భంగా వీరు... పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఫేస్బుక్లో పాకిస్థాన్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టారు. ఫలితంగా వారిని దేశ ద్రోహం కేసులో ఫిబ్రవరి 15న కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్ భద్రత కోసం ప్రత్యేక కమాండ్!