వందేభారత్ మిషన్ రెండో దశ జూన్ 13 వరకు కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ దశలో సేవలను మొత్తం 47 దేశాలకు విస్తరిస్తామని తెలిపింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు వందేభారత్ మిషన్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.
తొలుత కేంద్రం నిర్ణయించిన దాని ప్రకారం మే 22న రెండో దశ ముగియనుంది. అయితే తాజాగా వచ్చే నెల రెండో వారం వరకు పొడిగించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. జూన్ 13 తర్వాత మూడో దశ ఉంటుందని స్పష్టం చేశారు.
"47 దేశాల నుంచి 162 విమానాల ద్వారా భారతీయులను తీసుకురానున్నాం. ఇస్తాంబుల్, హోచిమిన్ సిటీ, లాగోస్ తదితర ప్రాంతాలకూ సేవలను విస్తరిస్తాం. అమెరికా, ఐరోపాలకు సర్వీసులు పెంచుతాం."
- అనురాగ్ శ్రీవాత్సవ
ఇప్పటివరకు 23,475 మందిని దేశానికి తీసుకొచ్చినట్లు శ్రీవాత్సవ తెలిపారు. మే 7 నుంచి 15 మధ్య నిర్వహించిన మొదటి దశలో భాగంగా.. 15 వేల మందిని తరలించామన్నారు. భారత్‌కు వచ్చేందుకు మొత్తం 98 దేశాల్లోని 2,59,001 మంది దరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేశారు. వందే భారత్ మిషన్‌లో పాలుపంచుకునేలా కేంద్ర విమానయాన శాఖ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.