వచ్చే ఏప్రిల్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ‘స్వచ్ఛభారత్’ రెండో దశ అమలుకు కేంద్రప్రభుత్వం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా నాలుగేళ్లపాటు చేపట్టాల్సిన వివిధ పనుల నిమిత్తం తాగునీరు, పారిశుద్ధ్య విభాగం పద్దులోంచి సుమారు రూ.52 వేలకోట్ల కేటాయింపులకు కేంద్ర మంత్రిమండలి తాజాగా ఆమోదముద్ర వేసింది. ఇటీవలి బడ్జెట్లో పరిశుభ్రతా మహోద్యమం మలి అంచెలో తొలి ఏడాదికిగాను దాదాపు రూ.10వేలకోట్లు ప్రత్యేకించడం తెలిసిందే. ఈ రెండో దశలో బహిరంగ మలమూత్ర విసర్జనలు రూపుమాసిపోవాలన్నది ప్రవచిత లక్ష్యం!
చేదు నిజాలు
వివిధ రాష్ట్రాల్లో పారిశుద్ధ్య సేవల తీరుతెన్నులను మదింపు వేసి, గ్రామీణాభివృద్ధిపై స్థాయీసంఘం ఆమధ్య చేదునిజాల్ని బయటపెట్టింది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌లు రెండేళ్ల వ్యవధిలోనే ఆరున్నర వేలకోట్ల రూపాయలదాకా స్వచ్ఛ నిధుల్ని మురగబెట్టాయని స్థాయీసంఘం అప్పట్లో విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అసోం ప్రభృత రాష్ట్రాల్నీ కలిపి లెక్కిస్తే పేరబెట్టిన మొత్తం రూ.14 వేలకోట్లకు పైబడినట్లు లెక్కకట్టింది. అనేక ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించడంవల్ల జవాబుదారీతనం గల్లంతయిందన్న స్థాయీసంఘం నిర్ధారణ, స్వచ్ఛభారత్ తొలి దశ వైఫల్యాలకు మూలకారణమేమిటో చెప్పకనే చెప్పింది.
స్వచ్ఛాగ్రహం
హెచ్చరికల్ని చెవినపెట్టి పేరుకుపోయిన నిధుల్ని సక్రమంగా వెచ్చించడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను సత్వరం పట్టాలకు ఎక్కించి ఉంటే- పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితాలు సాధ్యపడి ఉండేవి. రెండో దశలోనైనా స్వచ్ఛభారత్ సముదాత్త స్ఫూర్తి పొంగులువారేలా, కేటాయింపుల్లో ప్రతి రూపాయీ సద్వినియోగమయ్యేలా దిద్దుబాటు చర్యలు చురుకందుకోవాలి. గ్రామాల్లో మురికి, అనారోగ్యకర వాతావరణాన్ని చెదరగొట్టేలా అపారిశుద్ధ్యంపై స్వచ్ఛాగ్రహం పోటెత్తాలి!
దురవస్థ పోయేనా?
దేశంలో ఎక్కడ చూసినా బహిరంగ కాలకృత్యాలు, మురుగునీటి ప్రవాహాలతో జాతి తలదించుకునే దురవస్థను తుడిచిపారెయ్యాలనే పట్టుదలే ప్రాణశ్వాసగా 2014 అక్టోబర్ రెండో తేదీన స్వచ్ఛభారత్ ఉద్యమానికి మోదీ ప్రభుత్వం నాందీప్రస్తావన చేసింది. పరిశుభ్ర పరిసరాలతో జీవకళ ఉట్టిపడే జనావాసాలకు నెలవుగా దేశాన్ని తీర్చిదిద్దుకోవడమే స్వచ్ఛభారత్ ధ్యేయమన్న నినాదాలు నాడు ఆసేతు హిమాచలం ప్రతిధ్వనించాయి.
వంకపెట్టనక్కరలేదు!
బాపూజీ నూటయాభయ్యో జయంతి (2019 అక్టోబర్) నాటికి దేశంలో అందరికీ అందుబాటులో పక్కా మరుగుదొడ్లు, వ్యర్థాల శుద్ధి వ్యవస్థలు, నాణ్యమైన తాగునీరు, శుభ్రమైన రహదారులు కల్పించాలన్న స్వచ్ఛభారత్ మహదాశయాన్ని వంకపెట్టడానికి వీల్లేదు. బృహత్ లక్ష్యసాధనకు ఉపక్రమించి దేశంలో తొమ్మిదికోట్ల 20లక్షల మరుగుదొడ్లు నిర్మించామని; అయిదున్నర లక్షల గ్రామాలు, 28 రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన మటుమాయమైందని ఏడాదిక్రితం కేంద్రప్రభుత్వం ఘనంగా చాటుకుంది. దేశ జనాభాలో 95 శాతానికి మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయన్న సర్కారీ వాదనతో విభేదించిన జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ)- పల్లెపట్టుల్లో ఆ సంఖ్య 71 శాతమేనని స్పష్టీకరించింది.
గాలి తీసిన గణాంకాలు
ఒడిశా, యూపీలలో సగందాకా గ్రామీణ జనాభాకు మరుగుదొడ్లు ఇప్పటికీ పగటికలేనన్న జాతీయ నమూనా సర్వే గణాంకాలు కేంద్రం ప్రకటనలకు గాలి తీసేశాయి! ఇండియాలో ఏటా లక్షమంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి, మరెందరో శారీరకంగా మానసికంగా ఎదుగుదల మందగించి కుటుంబానికి పెనుభారం కావడానికి అపారిశుద్ధ్యమే కారణమవుతోంది.మునుపటితోపోలిస్తే-పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత, సామాజిక శౌచాలయాల నిర్మాణం ఊపందుకున్న మాట యథార్థమే అయినప్పటికీ- కోట్లమంది భారతీయులకు ఆ మౌలిక వసతి అందని మానిపండేనన్నది నిర్వివాదం. శాస్త్రీయ పంథాలో స్వచ్ఛభారత్ స్ఫూర్తి కదం తొక్కితేనే, ఏనాటికైనా మార్పు సాధ్యం!
లొసుగులు
సుమారు అయిదేళ్ల క్రితం స్వచ్ఛభారత్ పేరిట భూరిఉద్యమం ఊపిరి పోసుకునేటప్పటికి దేశ గ్రామీణ జనాభాలో పారిశుద్ధ్య వసతికి నోచుకున్నవారిగా రికార్డులకెక్కింది 39 శాతంలోపు. పెద్దయెత్తున నిర్మించినట్లు ప్రభుత్వం లెక్కచూపుతున్న మరుగుదొడ్ల సంఖ్యకు, నికరంగా వినియోగంలోకి వచ్చినవెన్ని అన్నదానికి పొంతన కుదరకపోవడం ఎవరూ కప్పిపుచ్చలేని లొసుగు. కొన్నాళ్ల క్రితం ఎనిమిది రాష్ట్రాల్లో ‘వాటర్ ఎయిడ్’ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆందోళనకర అంశాలెన్నింటినో వెల్లడించింది. నిర్మాణం పూర్తయినట్లు చెప్పిన మరుగుదొడ్లలో మూడోవంతే ఆరోగ్య భద్రతా ప్రమాణాల మేరకు ఉన్నాయని, 35 శాతానికి మరమ్మతులు చేసి తీరాలని, తక్కినవి వ్యర్థమేనని అది నిగ్గుతేల్చింది. రైస్ (కారుణ్య ఆర్థిక శాస్త్ర పరిశోధన సంస్థ) అధ్యయనం ప్రకారం, నాలుగు పెద్ద రాష్ట్రాల్లోని 44 శాతం గ్రామీణ జనాభాకు బహిరంగ మలవిసర్జన తప్ప గత్యంతరం లేదు.
బూడిదలో పోసిన పన్నీరు
స్వచ్ఛభారత్ పథకం కింద నిర్మితమైన కోట్లాది మరుగుదొడ్లు నీటి వసతి, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాట్లలో లోటుపాట్ల కారణంగా వినియోగానికి పనికిరాకుండా పోతున్నప్పుడు- వేలకోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరు చందమే. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను గాడిన పెట్టడం ఎంత ముఖ్యమో- స్వచ్ఛత, పరిశుభ్రతలపై జనచేతన పెంపొందించడమూ అంతే కీలకం. పాత అలవాట్లకు చెల్లుకొట్టి అందరూ శౌచాలయాల వినియోగానికి మళ్లేలా చేయడం, మానవ వ్యర్థాల్ని నిరపాయకరంగా తరలించే వ్యవస్థను ప్రామాణీకరించడం- ప్రభుత్వం ముందున్న సవాళ్లు. బయోటాయిలెట్ల నిర్మాణంలో ఖర్చు తక్కువని, పర్యావరణానికీ అది హితకరమన్న సిఫార్సుల్ని తోసిపుచ్చి అశాస్త్రీయంగా లక్షల సంఖ్యలో మరుగుదొడ్లు నిర్మించిన ఉదంతాలు పునరావృతం కాకూడదు. పౌర భాగస్వామ్యంతో పరిసరాల పరిశుభ్రతను ఉరకలెత్తించేలా ప్రభుత్వ వ్యూహాలు పదునుతేలాలి. ఆ మౌలిక మార్పే స్వచ్ఛభారతాన్ని ఆవిష్కరించగలిగేది!
ఇదీ చూడండి: 'యోగా ఒక మతం కాదు.. మహా శాస్త్రం'