'సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదు'
ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రాజీనామాతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సమాయత్తమవుతున్నాయి. మూడు పార్టీల కూటమికి మహా వికాస్ అఘాఢీగా నామకరణం చేశారు.
ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటు, విధి విధానాలపై ముంబయిలోని ట్రైడెంట్ హోటల్‌లో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ కూటమి నాయకుడిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ముఖ్యమంత్రిగా..
ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఠాక్రేకే మొగ్గు చూపారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే డిసెంబర్ 1న ప్రమాణం చేయనున్నారు. ముంబయిలోని శివాజీ పార్క్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం కుర్చీలో కూర్చొనే ఘనత ఉద్ధవ్‌దే కానుంది.
కలలో కూడా ఊహించలేదు..
ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటంపై ఉద్ధవ్ ఠాక్రే సంతోషం వ్యక్తం చేశారు. ఫడణవీస్ చేసిన ప్రతి ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
"రాష్ట్రాన్ని పాలిస్తానని కలలో కూడా ఊహించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు. మీరందరూ నాపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా. ఛత్రపతి శివాజీ కోరుకున్న మహారాష్ట్రను పునర్నిర్మిద్దాం. ఫడణవీస్ లేవనెత్తిన ప్రశ్నలంటికీ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నేను దేనికీ భయపడట్లేదు."
-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అధినేత
ఈ సమావేశం నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్రైడెంట్ హోటల్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడణవీస్‌ను గవర్నర్ ఆహ్వానించడానికి ముందు ఈ నెల 22న మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే అవి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.