ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల్లో నిందితుల్ని వెంటనే అరెస్టు చేయరాదన్న ఆదేశాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. 2018 మార్చి 20న ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ.....కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సమ్మతించింది. విచారణ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎస్సీ,ఎస్టీలు ఇప్పటికీ అంటరానితనం, సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సమానత్వం కోసం వారు చేస్తోన్న పోరాటం ఇంకా ముగియలేదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించిందని ధర్మాసనం గుర్తుచేసింది. దుర్వినియోగమనేది.. మానవ తప్పిదమే తప్ప.. చట్టం వల్ల కాదని అభిప్రాయపడింది.
గతంలో...
2018, మార్చి 20న ఎస్సీ ఎస్టీ చట్టంపై తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ.. నిందితుల్ని వెంటనే అరెస్టు చేయకూడదని ఆదేశాలిచ్చింది. పలు సందర్భాలను ఉదాహరణలుగా చూపింది.
అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయాలంటే ప్రత్యేక నియామక అధికారుల ఆమోదం ఉండాలని పేర్కొంది. ఉద్యోగేతరుల అరెస్ట్‌కు ఎస్ఎస్పీ ఆమోదం ఉండాలని స్పష్టం చేసింది.
కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ, ఎస్టీ సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. అనంతరం సుప్రీం తీర్పును అమలు చేయకుండా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ-2018కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్ దాఖలు చేసింది.
- ఇదీ చూడండి: 370 రద్దుపై కేంద్రం వివరణకు సుప్రీం ఆదేశం