విశ్వాస పరీక్ష వ్యాజ్యంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై బుధవారం ఉదయం 10.30 గంటల లోపు సమాధానమివ్వాలని కమల్‌నాథ్ సర్కారును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యప్రదేశ్ ప్రభుత్వం, శాసనసభ కార్యదర్శి పేరిట నోటీసులు జారీ చేసింది.
రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై..
విచారణ సందర్భంగా రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల అంశాన్ని ప్రస్తావించారు శివరాజ్‌సింగ్ చౌహన్ తరఫు న్యాయవాది. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని తెలిపారు. ఇప్పటికే ఆరుగురి రాజీనామాలు ఆమోదం పొందాయని.. మిగతా 16 మంది ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారని పేర్కొన్నారు.
గెలుపుపై చౌహాన్ ధీమా..
సుప్రీం విచారణ అనంతరం శాసనసభలో విశ్వాస పరీక్ష నెగ్గే అంశమై స్పందించారు శివరాజ్‌సింగ్ చౌహాన్. ప్రస్తుత ప్రభుత్వం కుప్పకూలుతుందని.. మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలు తమవద్ద ఉన్నారని పేర్కొన్నారు.
సింధియా తిరుగుబాటు నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గవర్నర్ ఆదేశాల మేరకు సోమవారమే అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా మార్చి 26 వరకు శాసనసభను వాయిదా వేశారు స్పీకర్ ఎన్పీ ప్రజాపతి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సహా మరో తొమ్మిది మంది శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చూడండి: చికిత్స చేసిన డాక్టర్‌కే కరోనా నిర్ధరణ