చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై దర్యాప్తు చేపట్టింది సుప్రీం కోర్టు. ఈ పిటిషన్లపై అభిప్రాయం తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సవరణల రాజ్యాంగ చట్టబద్ధను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
కేంద్రం తీసుకువచ్చిన సవరణల ప్రకారం దర్యాప్తు సంస్థలు ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించడం.. అతని ప్రాథమిక హక్కులను హరించడమే అని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. వాదన ఆలకించకుండా ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించడం రాజ్యాంగలోని ఆర్టికల్ 21 ప్రకారం అతని గౌరవం, ప్రతిష్టకు భంగం కల్గించడం, జీవించే హక్కును హరించడం అవుతుందని వివరించారు. ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తిని తర్వాత కాదు అని నిర్ధరించినా.. అది అతని ప్రతిష్టకు జీవితాంతం మచ్చగానే ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నమ్మకం ఆధారంగా ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించడం న్యాయబద్ధం కాదని వివరించారు.
ఆగస్టు 9న రాష్ట్రపతి ఆమోదం..
ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో సవరణలు చేస్తూ తీసుకువచ్చిన బిల్లుకు ఆగస్టు 9న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.
నలుగురిపై..
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం బుధవారం జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, 2008 ముంబయి ఉగ్రదాడి సూత్రధారి జకీ-ఉర్-రెహ్మాన్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంలను ఉగ్రవాదులుగా ప్రకటించింది.
ఇదీ చూడండి: ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు విచారణ నిరవధిక వాయిదా