దిగువ న్యాయస్థానాలు అసంపూర్తి, తప్పుడు తీర్పులు ఇచ్చిన కారణంగానే తమవద్దకు భారీ సంఖ్యలో కేసులు వస్తున్నాయని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. శిక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కింది న్యాయస్థానాలను ఎన్ని సార్లు సూచించినా తీరు మార్చుకోవటం లేదని ఆగ్రహించింది.
మధ్యప్రదేశ్లో కింది కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తగ్గించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ సదరు కేసులోని దోషులకు కొత్త శిక్షలు ఖరారు చేసింది. ముగ్గురికి మూణ్నెల్లు జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. ఇంకొకరికి రెండు నెలల జైలుతోపాటు రూ.65వేలు జరిమానా వేసింది.
ఇదీ కేసు..
2008లో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తి ఇంటిపై దౌర్జన్యం చేశారు. ఆవును కట్టేయనందుకు ఆయుధాలతో బెదిరించి దాడి చేశారు. ఈ కేసులో నలుగురిని దోషులుగా నిర్ధరిస్తూ ముడేళ్లు జైలు విధిస్తూ కింది కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే రిమాండ్ సమయంలో జైలులోనే గడిపామని.. శిక్షను తగ్గించాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించారు. పరిశీలించిన హైకోర్టు.. శిక్షను తగ్గిస్తూ తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి: ఆన్లైన్లో మొబైల్ బదులు రాళ్లు- భాజపా ఎంపీ షాక్