కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకంపై మధ్యంతర స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దాని కోసం సరైన దరఖాస్తును సమర్పించాలని పిటిషన్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థను ఆదేశించింది.
ఎన్నికల బాండ్లపై పూర్తి స్థాయిలో విచారణ అవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల సమయం కావున పిటిషన్పై ఈ నెల 10న విచారణ చేపడతామని తెలిపింది.
ఇదీ చూడండి: భారత్ భేరి: రికార్డుల కింగ్ సిక్స్ కొడతారా
95 శాతం బాండ్లు అధికార పార్టీకే
రాజకీయ పార్టీలకు కోట్లాది రూపాయలు అనామకంగా వచ్చి చేరుతున్నాయని ఎన్జీవో తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. 95 శాతం బాండ్లు అధికార పార్టీకే అందటమేంటని ప్రశ్నించారు.
నల్లధనం అరికట్టేందుకే..
రాజకీయ పార్టీలకు వచ్చే నల్లధనాన్ని అరికట్టేందుకే ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టినట్లు కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు.
ఎన్నికల బాండ్ల పథకం-2018పై స్టే విధించాలని ఎన్జీవో సంస్థ ఏడీఆర్(అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభించింది. వీటి వల్ల రాజకీయ పార్టీలకు వచ్చే నిధుల వివరాలలో పారదర్శకత ఉంటుందని పేర్కొంది.