లాక్డౌన్ కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల సమస్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. ఈ అంశంపై ఈ నెల 28న విచారణ జరపనుంది.
జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎమ్ ఆర్ షాతో కూడిన ధర్మాసనం.. వలస కూలీల కష్టాలపై కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన చర్యలను గురువారంలోపు తెలపాలని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మార్చి నెల నుంచి ఇప్పటివరకు వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు తిరిగివెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. సరైన వసతులు లేక చాలా మంది కాలినడకనే ఊళ్లకు వెళుతున్నారు.