గ్రామ న్యాయాలయాల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ విడుదల చేయని రాష్ట్రాలు.. నాలుగు వారాల్లో ఆ పనిని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై ఓ స్వచ్ఛంద సంస్ధ సమర్పించిన వివరాలను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు దిశగా రాష్ట్రాలతో సంప్రదించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీం ధర్మాసనం సూచించింది.
సుప్రీం ఆదేశాలు లెక్కచేయని తెలంగాణ
పలు రాష్ట్రాలు నోటిఫికేషన్ విడుదల చేసినా.. కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర మినహా ఏ రాష్ట్రంలోనూ ప్రక్రియ సరిగా సాగడం లేదని సుప్రీంకోర్టు గుర్తించింది. గతంలో తాము ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ సహా పలు రాష్ట్రాలు గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై అఫిడవిట్‌లు దాఖలు చేయలేదని తెలిపింది సుప్రీం ధర్మాసనం. అఫిడవిట్‌తో పాటు లక్ష రూపాయల నగదును సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2008లో గ్రామ న్యాయాలయాల ఏర్పాటు కోసం చట్టం రూపొందించింది.
ఇదీ చూడండి: అమెరికా వల్లనే 'కరోనా' భయం.. చైనా మండిపాటు