ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేర చరిత్రపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న వారిని పార్టీ అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారో కూడా కారణాలు తెలపాలని తేల్చి చెప్పింది ఉన్నత న్యాయస్థానం.
పత్రికల్లో ప్రచురించాలి..
అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను.. స్థానిక పత్రికలతోపాటు జాతీయ పత్రికల్లో ప్రచురించాలని పేర్కొంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది కోర్టు. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసిన 72 గంటల్లోగా ఆ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది.
కోర్టు ఉత్తర్వులను రాజకీయ పార్టీలు పాటించకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను రాజకీయ పార్టీలు పాటించడం లేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వెలువరించింది.
రాజకీయాల్లో నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య పెరుగుతున్న వేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చూడండి: హగ్ డే: భాజపాపై కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్