ప్రజా భద్రత చట్టం కింద జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని నిర్భంధంలో ఉంచడాన్ని సవాల్ చేస్తూ ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు జమ్ముకశ్మీర్ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఓ వ్యక్తిని ఎంతకాలం పాటు నిర్బంధంలో ఉంచవచ్చో సమాధానం ఇవ్వాలని నిర్దేశించింది.
పీడీపీ సభ్యులను ముఫ్తీ కలవటానికి అనుమతినివ్వాలని పిటిషన్లో కోరారు ఇల్తిజా. ఈ అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు... పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు సంబంధిత అధికారుల వద్ద అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని మెహబూబా ముఫ్తీకి సూచించింది. నిర్బంధం ఎల్లకాలం ఉండదన్న సర్వోన్నత న్యాయస్థానం ముఫ్తీని కలిసేందుకు ఆమె కుమార్తె ఇల్తిజాకు, కుమారుడికి అనుమతించింది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం రద్దు అనంతరం శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని గతేడాది ఆగస్ట్‌లో నిర్బంధంలోకి తీసుకున్నారు. తాజాగా మరో సారి జులైలో ఆమె నిర్బంధాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ముఫ్తీ కుమార్తె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.