దేశాన్ని రెండుగా విభజించాలనే ఆలోచనకు బీజం వేసింది హిందూ మహాసభ నేత వినాయక్ దామోదర్ సావర్కరేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 55వ వర్థంతి సందర్భంగా రాయ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
" స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజన జరిగింది. మహ్మద్ అలీ జిన్నా దేశాన్ని విడగొట్టారు. అంతకు ముందు 16 సంవత్సరాల క్రితమే హిందువులు, ముస్లింలకు వేర్వేరు దేశాలు ఉండాలని వినాయక్ దామోదర్ సావర్కర్ కాంక్షించారు. దేశ విభజన ఆలోచన సావర్కర్‌ది. దాన్ని అమలు చేసింది జిన్నా."
-భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి
అణు ప్రయోగాలు, అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచం శ్రేణి ప్రభుత్వ సంస్థలు నెలకొల్పి దేశ నిర్మాణంలో నెహ్రూ కీలక భూమిక పోషించారన్నారు బఘేల్. ప్రస్తుతం ఆయన ఆలోచనలను నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
భాజాపా ఖండన
సావర్కర్‌పై బఘేల్ వ్యాఖ్యలను ఖండించారు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్. చరిత్రపై సరైన అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని బదులిచ్చారు. దేశ విభజనపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదన్నారు రమణ్ సింగ్.
ఇదీ చూడండి: 'అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది'