ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్'ను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారు. దేశ తొలి ఉపరాష్ట్రపతికి తమదైన శైలిలో నివాళులు అర్పిస్తున్నారు. ఝార్ఖండ్ బొకారో జిల్లా చందన్కియారీ గ్రామానికి చెందిన 'సందక్ అజయ్ శంకర్ మెహతో'.. టీచర్స్ డేను సరికొత్తగా జరుపుకున్నాడు. ఇసుకతో భారతరత్న సర్వేపల్లి చిత్రాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది అందరి మెప్పు పొందాడు.
తెరిచిన పుస్తకం రూపంలో ఉన్న ఈ సైకత శిల్పంలో ఒక పేజీలో సర్వేపల్లి చిత్రం, మరో పేజీలో " ద బెస్ట్ టీచర్స్ ఫ్రమ్ హార్ట్ నాట్ ఫ్రమ్ ద బుక్ (గొప్ప ఉపాధ్యాయులు హృదయం నుంచి వస్తారు. పుస్తకాల నుంచి కాదు) " అనే సందేశాన్ని రాశారు. కింది భాగంలో 'హ్యాపీ టీచర్స్ డే' అని శుభాకాంక్షలు తెలిపి చివరన పెన్ను ఆకారమున్న చిత్రాన్ని గీశారు. మరోవైపు భారతరత్న అవార్డునూ తీర్చిదిద్దారు. దామోదర్ నదీ తీరంలోని షిల్ఫోర్ గ్రామంలో ఉన్న ఈ చిత్రాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్నారు.