'గ్రామ వాస్తవ్య' పేరుతో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేస్తున్న పల్లెనిద్రపై విమర్శనాస్త్రాలు సంధించారు కేంద్ర రసాయన, ఎరువుల శాఖమంత్రి డీవీ సదానందగౌడ. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో నెలకొన్న సంక్షోభం నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు ఈ పల్లెనిద్రను తలపెట్టారు కన్నడ సీఎం. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 2006-07 మధ్యకాలంలోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.
"సీఎం గతంలోనూ పల్లెనిద్రలు చేశారు. కానీ అక్కడి సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రస్తుతం ఆయన సంక్షోభంలో ఉన్న ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్నుంచి దృష్టి మళ్లించేందుకే పల్లెనిద్రకు తెరతీశారు."
-సదానంద గౌడ, కేంద్ర రసాయన, ఎరువుల శాఖమంత్రి
సంకీర్ణం కూలిపోతే ప్రత్యామ్నాయం
కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తామని వెల్లడించారు సదానంద గౌడ. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడం తమ విధానం కాదని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని స్వయంగా వారు కూల్చేసుకుంటే అతిపెద్ద పార్టీగా ప్రత్యామ్నాయానికై ఆలోచించడం తమ బాధ్యతన్నారు సదానంద.