శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కులైన మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసులో భాగంగా విస్తృత ధర్మాసనం ఏడు ప్రశ్నలను తయారు చేసింది. రాజ్యాంగ పరిధికి లోబడి మతపరమైన స్వేచ్ఛ, విశ్వాసాలకు సంబంధించి ఏడు ప్రశ్నలపై కక్షిదారుల వాదనలు ఆలకిస్తామని 9 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
'సెక్షన్ ఆఫ్ హిందూస్'పై సమీక్ష
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన స్వేచ్ఛ, వివిధ మతాల పరిధిలో హక్కులకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. మతపరమైన సంప్రదాయాల విషయంలో న్యాయ సమీక్ష చేయవచ్చా అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. 'సెక్షన్ ఆఫ్ హిందూస్' అనే పదం అర్థాన్ని కూడా సమీక్షిస్తామని వివరించింది. ఏ మతానికి చెందని వ్యక్తికి ఉండే హక్కులను కూడా పరిశీలిస్తామని తెలిపింది.
కీలక అంశాలు ఇవే
- మత విశ్వాసాలకు ఉన్న విస్ర్తృతి, పరిధులు, నైతికత
- మతాలకు సంబంధించిన విషయాల్లో న్యాయ సమీక్షాధికారం
- రాజ్యంగంలోని ఆర్టికల్ 25(2)(బి)లో పేర్కొన్న ‘హిందువు’కు వివరణ
- మత విశ్వాసాల్లో మార్పులు
- మతవిశ్వాసాల్లో వివిధ తెగల మధ్య ఉన్న నమ్మకాల గురించి ఈ విస్త్రృత ధర్మాసనం విచారిస్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.
17 నుంచి విచారణ
ప్రశ్నావళికి సంబంధించి, గతంలో శబరిమల కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం కూడా కొన్ని సలహాలు ఇవ్వవచ్చని సూచించింది. ఈ ప్రశ్నావళిపై ఈనెల 17 నుంచి రోజువారీ విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.