భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చడంలో రష్యా కీలక పాత్ర పోషించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకోసం ఆ దేశం తెర వెనుక పాత్ర పోషించి ఉండొచ్చని పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: 'భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు'
తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోగల సత్తా భారత్, చైనాకు ఉందని మంగళవారం జరిగిన రష్యా, భారత్, చైనా(ఆర్ఐసీ) సదస్సులో రష్యా విదేశాంగ మంత్రి సెర్గోయ్ లావ్రోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ వాదన తెరపైకి వచ్చింది.
"ఆర్ఐసీలో ఉద్రిక్తతలను చల్లార్చడంలో రష్యా తెర వెనుక పాత్ర పోషిస్తుంటుంది. 2002లో ఈ కూటమి అంశం తెరపైకి వచ్చాక చాలా మార్పులు జరిగాయి. వర్ధమాన దేశాల ఆకాంక్షలను నెరవేర్చేలా ఒక బహుళ ధ్రువ ప్రపంచాన్ని సృష్టించాలన్న ఉమ్మడి లక్ష్యం నాడు ఈ 3 దేశాల్లో ఉండేది. ఆ తర్వాత అమెరికా విషయంలో వ్యూహాత్మక సమతూకం పాటించడం ఈ కూటమి ఉద్దేశంగా మారింది"
-రాజర్షి రాయ్, రష్యా వ్యవహారాల విశ్లేషకుడు
అయితే ఆ తర్వాత అమెరికాతో సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు రాయ్. అయినా బ్రిక్స్, ఎస్సీఓ కూటముల్లో ఈ 3 ఆర్ఐసీ దేశాలు కీలకంగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచ జీడీపీలో ఆర్ఐసీకి 30-35శాతం వాటా ఉందని తెలిపారు.
రష్యా ప్రయోజనాలకు భంగం!
ఆర్ఐసీ భేటీలో భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ప్రధాన దేశాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలంటూనే బహుళత్వవాద అవసరాన్ని పునరుద్ఘాటించారని దిల్లీ జేఎన్యూలోని అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ రాజన్ కుమార్ గుర్తుచేశారు. ఆర్ఐసీ అనేది రష్యాకు చాలా ముఖ్యమన్నారు. భారత్, చైనా మధ్య ఘర్షణలు పెరిగితే భారత్ ఎక్కువగా అమెరికా వైపు మొగ్గుతుందని తెలిపారు. ఫలితంగా భారత్-పసిఫిక్ ప్రాంతంలో రష్యా ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు. దీనికి తోడు భారత్... అమెరికా ఆయుధాల్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుందని, ఫలితంగా రష్యా ఆయుధ మార్కెట్ దెబ్బతింటుందని వివరించారు.
ఇదీ చదవండి: 'వివాదాల పరిష్కారానికి సరైన మార్గాలు అన్వేషించాలి'
వీటన్నింటి దృష్ట్యా భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను చల్లార్చాల్సిన బాధ్యత రష్యాకు ఉందని చెప్పారు. పైగా ఈ వివాదంతో సానుకూల పాత్ర పోషించే అవకాశం ఆ దేశానికే ఉందని తెలిపారు. భారత్, చైనాతో రష్యాకు సత్సంబంధాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: 'రష్యా- భారత్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం'