కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఎల్డీఎఫ్ అదే జోరు కనబరిచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విజయం.. పార్టీకి మరింత బలం చేకూర్చింది. 'అభివృద్ధికే మీ ఓటు' అన్న ఎల్డీఎఫ్ నినాదం ముందు ప్రతిపక్షాల ఎత్తులు ఫలించలేదు. కేరళలో జెండా పాతాలన్న భాజపా ప్రయత్నం విఫలమవగా.. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ తన ధోరణిని కొనసాగించింది.
సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రెటిక్ ఫ్రంట్) 2015లో కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. గ్రామ పంచాయతీల్లో 514, బ్లాక్ పంచాయతీల్లో 112, జిల్లా పంచాయతీల్లో 10 స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీల్లో మాత్రం ఆధిపత్యం చెలాయించలేక పోయింది. 35 మాత్రమే గెలిచింది.
గత ఎన్నికల్లో జిల్లా పంచాయతీలోని 14 స్థానాల్లో ఎల్డీఎఫ్ కేవలం ఏడింటిలోనే గెలుపొందింది. కార్పొరేషన్లలోని ఆరు స్థానాల్లో 3 మాత్రమే గెలిచిన ఎల్డీఎఫ్.. స్వతంత్రులు, తిరుగుబాటుదారుల మద్దతుతో మరో రెండు స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఎన్ని స్థానాల్లో గెలుపు..
గ్రామ పంచాయతీలు-941
- ఎల్డీఎఫ్- 514
- యూడీఎఫ్ - 377
- ఎన్డీఏ - 22
- ఇతరులు -28
బ్లాక్ పంచాయతీలు-152
- ఎల్డీఎఫ్-112
- యూడీఎఫ్- 40
జిల్లా పంచాయతీలు(జెడ్పీ)-14
- ఎల్డీఎఫ్- 10
- యూడీఎఫ్-4
మునిసిపాలిటీలు-86
- యూడీఎఫ్-45
- ఎల్డీఎఫ్-35
- ఎన్డీఏ- 2
- ఇతరులు- 4
కార్పొరేషన్లు-6
- ఎల్డీఎఫ్-3
- యూడీఎఫ్-3
కమలం వికసించలేదు.. హస్తం నిలవలేదు
కేరళలో పట్టు సాధించాలన్న కమలం ప్రయత్నాలు ఎన్నికల్లో ఫలించలేదు. తనదైన శైలిలో భాజపా సంధించే అస్త్రాలను ఎల్డీఎఫ్ దీటుగా ఎదుర్కొంది. కాంగ్రెస్ కూడా భాజపా దారినే అనుసరించింది. హస్తం కంచు కోటలుగా ఉన్న కొట్టాయం, ఇడుక్కి, పతనంతిట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పట్టు సడలింది.
ఈ ఎన్నికలతో కేరళపై కమలం మరింత దృష్టి సారిస్తుందని.. కాంగ్రెస్ బలహీనపడటమే అందుకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అభివృద్ధి.. సంక్షేమం.. విజయం
స్థానిక సంస్థల పనితీరు ఎల్డీఎఫ్ విజయంలో కీలక పాత్ర పోషించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజల ఎల్డీఎఫ్ను మరోసారి గద్దెను ఎక్కించేలా చేసిందని పేర్కొంటున్నాయి.
యువతకు అవకాశం..
ఈ ఎన్నికల్లో ఓటర్లు యువతకు పట్టం కట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీనియర్ నేతలను ఎదుర్కొని యువ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
ఇదీ చూడండి: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఈసీ చర్యలు