మధ్యప్రదేశ్లోని ఇండోర్ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే మిమ్మల్ని ఒక మరయంత్రం పలకరిస్తుంది. పలకరించడమే కాదు మీకు అన్ని రకాలుగా సాయం చేస్తుంది. మీ లగేజీ పోతే... తిరిగి ఎలా గుర్తించాలో సూచిస్తుంది. దారి తెలియకపోయకపోతే మార్గనిర్దేశం చేస్తుంది. విమానాశ్రయంలోని ఏ అధికారితో మాట్లాడాలన్నా క్షణాల్లో వారి ఫోన్నంబర్ మీ ముందు ఉంచుతుంది. ఇన్ని రకాల విశిష్టతలున్నాయి కాబట్టే.. ఈ రోబో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
'ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా' సహకారంతో 'ఆక్రోపాలిస్ ఇంజినీరింగ్ కాలేజ్' విద్యార్థులు ఈ రోబోను ఆవిష్కరించారు. అధునాతన సాంకేతిక సెన్సార్లు, ఐపాడ్తో ఈ రోబోను రూపొందించారు.
" విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు అందరికీ ఈ రోబో స్వాగతం పలుకుతుంది. ఈ రోబోలో ఒక ఐపాడ్ ఉంటుంది. అందులో విమానాశ్రయంతో పాటు ఇండోర్ నగర సమాచారం మొత్తం ఉంటుంది. "
- దేవి అహల్యా భాయ్ హోల్కర్, విమానాశ్రయ అధికారి
ఈ రోబో ప్రస్తుతానికి ఒకేచోట నిల్చుని పనిచేస్తుంది. త్వరలో అటూఇటూ తిరుగుతూ సాయమందించేలా అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు.