పండగల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 200 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ వీకే యాదవ్. ఆయా ప్రాంతాల్లోని కరోనా పరిస్థితులను గమనించి.. రైళ్ల సేవలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
"జోన్ల వారీగా మేనేజర్లతో సమావేశమయ్యాం. ఆయా ప్రాంతాల్లోని కరోనా వ్యాప్తి వివరాలను సేకరించాలని సూచించాం. వాళ్లు ఇచ్చిన నివేదికానుసారం.. పండగ సీజన్లో రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటాం. మేము 200 రైళ్లు అవసరమవుతాయని అనుకుంటున్నాం. కానీ, ఇది మా అంచనా మాత్రమే. ఇంతకంటే ఎక్కువగా కూడా సేవలు అందించవచ్చు."
--- రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ వీకే యాదవ్
అవసరమైతే అదనంగా క్లోన్ రైళ్లు..
కరోనా కారణంగా క్లోన్ రైళ్లలో 60 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండేలా ఏర్పాట్లు చేస్తామని వీకే యాదవ్ తెలిపారు.
"ఓ సాఫ్ట్వేర్ ఆధారంగా మేము ప్రతీ ఉదయం క్లోన్ రైళ్ల రాకపోకలను పరిశీలిస్తున్నాం. ఎక్కడైనా క్లోన్ రైలు పూర్తిగా నిండినట్లయితే అదనంగా మరో రైలును ఏర్పాటు చేస్తాం" అని అన్నారు యాదవ్.
కొవిడ్ మహమ్మారి వల్ల అన్ని సాధారణ రైళ్లను మార్చి నుంచి రైల్వే శాఖ నిలిపివేసింది. ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి దిల్లీని కలిపే 15 ప్రీమియం రాజధాని రైళ్ల సేవలను మే 12న ప్రారంభించింది. జూన్ 1 నుంచి దూర ప్రాంతాలకు 100 రైళ్లను.. సెప్టెంబర్ 12 నుంచి మరో 80 ట్రైన్స్‌ను నడుపుతోంది.
ఇదీ చూడండి: 'కొండచిలువ'ను తరిమి కుక్కను కాపాడి..!