దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకొంది. మార్చి 22 అర్ధరాత్రి నుంచి మార్చి 31 వరకు 13,523 ప్యాసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇటీవల కొంత మంది క్వారన్‌టైన్‌లలో చికిత్స పొందుతున్న వారు తప్పించుకొని రైళ్లలో తిరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అలా దొరికిన వారికి పరీక్షలు నిర్వహించగా... 12 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు రైళ్ల సేవలు నిలిపివేస్తోంది భారతీయ రైల్వే.
రైల్వే శాఖ ప్రకటనలోని మరిన్ని వివరాలు...
⦁ మార్చి 22 అర్ధరాత్రి వరకు సబర్బన్ సర్వీసులు, కోల్‌కతా మెట్రో రైలు సేవలు కొనసాగుతాయి.
⦁ కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో సేవలు సహా అన్ని ప్రయాణికుల రైలు సేవలు మార్చి 31 అర్ధరాత్రి వరకు రద్దు.
⦁ మార్చి 22 తెల్లవారుజామున 4 గంటలకు ముందే ప్రారంభమైన రైళ్లను ఆయా గమ్యస్థానాలకు చేరేలా చర్యలు. ప్రయాణికులకూ వారు చేరాల్సిన ప్రదేశాలకు వేళ్లేలా తగిన ఏర్పాట్లు.
⦁ జూన్ 21 వరకు రద్దు చేసిన రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు పూర్తి డబ్బులు తిరిగి చెల్లింపు.
⦁ భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ సేవలు కుదింపు. రైళ్లలో చిప్స్, బిస్కెట్లు, టీ, కాఫీ సరఫరా వంటి సేవలు నిలిపివేత.
⦁ ఏప్రిల్ 15 వరకు అన్ని రైల్వే మ్యూజియంలు, హెరిటేజ్ గ్యాలరీలు, పార్కులు మూసేయాలని నిర్ణయం.