కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన రైల్వే సేవలను ఈనెల 15 నుంచి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది రైల్వే శాఖ. ఈ మేరకు భద్రత, గార్డ్స్, టీటీఈ, ఇతర సిబ్బంది ఏప్రిల్ 15వ తేదీ నుంచి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు అందినట్లు రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. అయితే.. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ అంశంపై ఏర్పడిన మంత్రుల బృందం ఆమోదం లభించిన తర్వాతే సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు.. దేశంలోని అన్ని రైల్వే జోన్లకు రైళ్ల షెడ్యూల్, వెళ్లాల్సిన దూరం వంటి వివరాలతో పునరుద్ధరణ ప్రణాళికను విడుదల చేసింది రైల్వే శాఖ. 17 జోన్లు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఏప్రిల్ 14 వరకే రైళ్ల రద్దుకు ఆదేశాలు ఉన్నాయని.. ఇప్పటి వరకు ఎలాంటి కొత్త ఆదేశాలు అందలేదని కొందరు ఉన్నతాధికారులు తెలిపారు. 15 నుంచి సేవలు పునరుద్ధరించేందుకు మరోమారు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అందుబాటులోకి 80 శాతం రైళ్లు
ఏప్రిల్ 15 నుంచి షెడ్యూల్ ప్రకారం సుమారు 80 శాతం రైళ్లు నడిచే అవకాశం ఉంది. ఇందులో రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు లోకల్ ట్రైన్లనూ నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
స్క్రీనింగ్..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించాయి.
ఇదీ చూడండి: ఈ గొడుగు ఉంటే కరోనా మీ దరిచేరదు!