కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ ఎన్‌డీఏ నుంచి రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్‌ఎల్‌పీ) వైదొలిగింది. రైతులకు వ్యతిరేేకమైన ఏ పార్టీతోనూ తాము కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆర్‌ఎల్‌పీ వ్యవస్థాపకుడు, రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ తేల్చి చెప్పారు. రైతులు ఆందోళనల్లో తాము కూడా పాల్గొంటామని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమంలో ఈ మేరకు బేనీవాల్ ప్రకటన చేశారు.
భాజపా నుంచి వైదొలిగిన బేనీవాల్.. 2018లో రాష్ట్ర ఎన్నికలకు ముందు ఆర్‌ఎల్‌పీని స్థాపించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది. అప్పటి నుంచి కూటమిలో కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని శివసేన ఎన్డీయేకు దూరం అవ్వగా.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌లోని అకాలీదళ్ సైతం కూటమిని వీడింది. తాజాగా ఆర్‌ఎల్‌పీ కూటమిని వీడడంతో ఎన్డీయే నుంచి బయటకొచ్చిన పార్టీల సంఖ్య మూడుకు చేరింది.