జీవించే హక్కు కంటే మత హక్కు ఎక్కువ కాదని పేర్కొంది మద్రాసు హైకోర్టు. కరోనా ప్రోటోకాల్, ప్రజారోగ్యంతో రాజీ పడకుండా మత ఆచారాలను నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ధర్మాసనం జోక్యం చేసుకోదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ స్పష్టం చేశారు. 'మతపరమైన ఆచారాలు ప్రజా ప్రయోజనాలకు, జీవించే హక్కుకు లోబడి ఉండాలి' అని వ్యాఖ్యానించారు.
తిరుచిరాపల్లి జిల్లాలోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో నిర్విహంచే ఉత్సవాలు, ఆచారాలు కొవిడ్ ప్రోటోకాల్, ప్రజారోగ్యంతో రాజీ పడకుండా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్ బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం. కరోనా నేపథ్యంలో దుర్గాపూజలో భక్తుల రద్దీని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని బంగాల్ ప్రభుత్వానికి కోల్కతా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రసావించింది.
శ్రీరంగం ఆలయంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. రంగరాజన్ నరసింహన్ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా నేపథ్యంలో వివిధ తేదీల్లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ తరఫు న్యాయవాది సీనియర్ అడ్వొకేట్ సతీశ్ పరాశరన్ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన రికార్డులు ధర్మాసనానికి సమర్పించారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన న్యాయస్థానం.. ఆరు వారాలకు విచారణను వాయిదా వేసింది.
ఇదీ చూడండి: భక్తులకు శుభవార్త- 'శబరిమల రైలు'కు ఓకే