నిన్న జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. శనివారం ఆంక్షలు సడలించిన తర్వాత కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల కశ్మీర్ యువతకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నందు వల్ల మళ్లీ ఆంక్షలను విధించినట్లు చెప్పారు. దాదాపు 12 ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారని.. ఈ ఘటనలో పలువులు నిరసనకారులకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి విడత హజ్ యాత్ర చేపట్టిన మూడు వందల మంది యాత్రికులు శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వారు స్వస్థలాలకు చేరుకునే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
35 పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ఆంక్షలు ఎత్తివేసిన అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, అనంతరం ఆంక్షలు తిరిగి విధించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.
ఉగ్రవాదులపైనే పోలీసుల దృష్టి
ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఉగ్రవాదులను ఏకాకి చేయడంపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు కశ్మీర్ డీజీపీ దిల్బాఘ్ సింగ్ తెలిపారు. తీవ్రవాదులపై ఒత్తిడి పెంచే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏడాదిగా జమ్ముకశ్మీర్లో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఆయన.. కశ్మీర్లో బలగాలు అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు గొప్ప సహకారం అందించారన్నారు.
నిరంతరం బలగాల పహారా
జమ్ముకశ్మీర్లో పగలు రేయి తేడా లేకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి బలగాలు. ఏ క్షణం ఎక్కడ ఉలిక్కి పాటు ఘటన జరిగినా వెంటనే రంగంలోకి దిగి పరిస్థితులు చక్కబెడుతున్నారు.
రాత్రంతా మేల్కొని ఉండి బాధ్యతలు నిర్వర్తించి అలసిపోయినా ఉదయం సహోద్యోగులు విధుల్లో చేరుకునే వరకు ఎక్కువ సమయం పహారా కాస్తున్నారు.