ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. తొలిసారి అవినీతి నిరోధక సంస్థ(ఏసీబీ)ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ప్రసంగించారు మోదీ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభకు తెలిపారు.
జమ్ముకశ్మీర్ ప్రజలు తొలిసారి రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని మోదీ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, స్థిరాస్థి అభివృద్ధి చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. వాణిజ్య , అంకుర సంస్థల స్థాపనతో జమ్ముకశ్మీర్ ప్రగతి పథంలో నడుస్తోందని మోదీ పేర్కొన్నారు.
ఎలాంటి చర్చ లేకుండానే కశ్మీర్లో 370ని రద్దు చేశారని విపక్షాల చేసిన ఆరోపణలను ఖండించారు మోదీ. ఈ విషయంపై సభలో జరిగిన చర్చను దేశ ప్రజలంతా చూశారని గుర్తు చేశారు. ఎంపీలంతా ఓటింగ్‌లో పాల్గొన్నారని స్పష్టం చేశారు.
ప్రజలు ఏ విషయాన్నీ అంత సలభంగా మర్చిపోరన్నారు మోదీ. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి... తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే బిల్లు సభలో ఏ విధంగా ఆమోదం పొందిందో గుర్తు చేసుకోవాలని విపక్షాలకు హితవు పలికారు.
"రాజ్యసభ ప్రతిపక్ష నేతకు నేను ఓ విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా. తెలంగాణ ఏర్పాటు చేసే ప్రక్రియ సభలో ఏ విధంగా జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలి. బిల్లు ఆమోదం పొందినప్పుడు సభను మూసివేశారు. టీవీ ప్రసారాలు నిలిపివేశారు. చర్చకు అవకాశమే లేదు. గందరగోళం మధ్యే బిల్లును ఆమోదించారు. "
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి నెలకొందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు మోదీ. గతంలో ఎన్నడూ లేనంత శాంతియుతంగా ఆ ప్రాంతాలున్నాయని చెప్పారు.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: రెండు భావజాలాల మధ్యే యుద్ధం!