దేశంలో ఇప్పటివరకు నమోదైన మరణాల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు భారత్ సహా ఇతర దేశాలకు చెందిన పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు. ఈ మేరకు 200 మందికిపై సంతకాలు చేసి 'రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా' కార్యాలయం, రాష్ట్రాల రిజిస్ట్రార్లు, ప్రభుత్వ సంస్థలకు లేఖ రాశారు.
ఈ వివరాలు బహిర్గతం చేస్తే కరోనా కారణంగా మరణాల ప్రభావం ఎలా ఉంటుందో వాస్తవిక అవగాహన వస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. అలాగే ప్రతిస్పందన విధానాలను రూపొందించేందుకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
"దేశవ్యాప్తంగా నమోదైన మరణాల వివరాలను తక్షణమే విడుదల చేయాలి. గత కొద్ది నెలల్లో చాలా దేశాల్లో కీలక రిజిస్ట్రేషన్ వ్యవస్థలతో ఈ వివరాలను బహిర్గతం చేశారు. ఉపశమన వ్యూహాలు తెలియజేయడానికి అవి ఉపయోగపడ్డాయి. ఏ ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలో, పరీక్షలు ఎక్కడ ఎక్కువ నిర్వహించాలో, ఆరోగ్య సేవలు ఎక్కడ మెరుగుపర్చాలో స్పష్టమైన అవగాహన వస్తుంది. వైరస్ వ్యాప్తి కారణంగా మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది."
-లేఖలో పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు.