పుదుచ్చేరి ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య రగడ రాష్ట్రపతి వద్దకు చేరింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తుగ్లక్ దర్బార్ నడిపిస్తున్నారని విమర్శిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు అక్కడి సీఎం నారాయణ స్వామి. నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలును అడ్డుకోవడమే కాకుండా.. ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిలో బేడీ తరచుగా జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. ఆమెను వెంటనే తొలగించాలని కోరారు.
2016లో పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ నియమితులైనప్పటి నుంచి సీఎం, గవర్నర్ మధ్య విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై రాష్ట్రపతితో భేటీ అయ్యారు సీఎం నారాయణస్వామి. అరగంట పాటు కోవింద్‌తో చర్చలు జరిపారు. సవివర మెమోరాండంను ఆయనకు అందించారు.
"డా. కిరణ్ బేడీ చట్టాన్ని ఉల్లంఘించి అప్రజాస్వామికంగా తుగ్లక్ దర్బార్‌ను నడిపిస్తున్నారు. 1963-పుదుచ్ఛేరి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్య సంస్థలకు నాశనం చేశారు. ప్రజాస్వామ్యాన్ని క్రూరంగా హత్య చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఆమె(బేడీ) ప్రమాదకరం. దేశ రాజ్యాంగ పరిరక్షకులుగా మీరు(రాష్ట్రపతి) ఈ విషయంలో కల్పించుకొని.. కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో నుంచి తొలగించి ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్యా వ్యవస్థను నిలబెట్టాలి."
-మెమోరాండంలోని ఓ భాగం
ఫ్రెంచ్ వారి పాలనలోనూ తమను ఈ విధంగా పరిగణించలేదని సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. వారు(ఫ్రెంచ్) ప్రజలను గౌరవించారని, బానిసలుగా చూడలేదని చెప్పారు. కిరణ్ బేడీని ఆ పదవిలో నుంచి తొలగిస్తే లెఫ్టినెంట్ గవర్నర్ హోదాకు ఉన్న గౌరవం మళ్లీ నిలబడుతుందని అన్నారు. బేడీని తొలగించాలన్న వినతిపై లక్ష మంది సంతకాలు చేసిన పత్రాలను రాష్ట్రపతికి అందించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: