భాజపాను అధికారానికి దూరంగా ఉంచే పేరుతో సుమారు ఏడాది క్రితం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్- జేడీఎస్ కూటమిది ఆది నుంచి కలహాల కాపురమే. పైకి స్నేహంగా ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం రెండు పార్టీల నేతల మధ్య పరస్పరం అపనమ్మకం, శతృత్వమే ఉండేది.
విభేదాలతోనే ఏడాది పాటు సంకీర్ణాన్ని నడిపించిన కాంగ్రెస్-జేడీఎస్ మధ్య ఇటీవలి సార్వత్రిక ఎన్నికలు లుకలుకలను మరింత పెంచాయి. సీట్ల పంపకం దగ్గర నుంచి ప్రచారం వరకు అన్నీ గొడవలే. పైకి కలిసి ప్రచారం నిర్వహించినా రెండు పార్టీల మధ్య అంతటా సమన్వయ లోపమే.
ప్రచారంలోనూ అంటీ ముట్టనట్లు వ్యవహరించారు రెండు పార్టీల నేతలు. క్షేత్రస్థాయిలోనూ కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు కలిసి పని చేసిన పరిస్థితి కనిపించలేదు. ఈ పరిణామాలే ఫలితాల్లో ప్రతిబింబించాయి. భాజపా ఏకంగా 25 సీట్లతో తిరుగులేని సీట్లు సాధిస్తే, కాంగ్రెస్, జేడీఎస్ రెండు సీట్లకే పరిమితమయ్యాయి.
జేడీఎస్ దిగ్గజం, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన మనవడు నిఖిల్ గౌడకూ ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ మహామహులూ భాజపా ధాటికి పరాజయం పాలయ్యారు. కలిసి పోటీ చేసినా కూటమి ఈ స్థాయిలో పరాభవం పొందడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, జేడీఎస్ మధ్య విభేదాలు, నేతల వ్యవహార శైలే.
ప్రజల్లో విసుగు...
శాసనసభ ఎన్నికల్లో పరస్పరం శత్రువులుగా బరిలోకి దిగిన ఈ రెండు పార్టీలను తాము ఓడించినా భాజపాను నిలువరించే పేరుతో ఒక్కటి కావడం కన్నడ ప్రజలకు నచ్చలేదు. అదీ కాకుండా... కూటమిలో నిత్య కలహాలు, పాలనపై దృష్టి సారించకుండా విభేదాలకే ఎక్కువ సమయం కేటాయించడం ప్రజలకు విసుగు పుట్టించాయి. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని అస్థిరత్వం వంటి కారణాలు ఈ పార్టీల ఓటమికి దారి తీసాయి.
అసలే కాంగ్రెస్, జేడీఎస్ మధ్య రగులుతున్న విభేదాల మంటలకు సార్వత్రిక ఫలితాలు ఆజ్యం పోశాయి. ఒక్కసారిగా మాటల యుద్ధం పెరిగింది. ఒక దశలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య కూడా.. కుమారస్వామి సర్కారు తీరును ఆక్షేపించారు. ఇటీవలి ఎన్నికల్లో కూటమి వైఫల్యానికి కుమారస్వామే కారణమని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. దేవెగౌడ కూడా సిద్ధరామయ్య పట్ల కోపంగానే వ్యవహరించారు.
ఇలా పెరిగిన విభేదాలు ఇంతింతై అంతిమంగా ప్రభుత్వ పతనానికే దారి తీశాయి.
ఇదీ చూడండి: అధికరణ 370 రద్దు: కశ్మీరీల అంగీకారమే కీలకం