భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య సహా పలువురు అగ్రనేతలు జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జైట్లీ గొప్పనేత..
అరుణ్ జైట్లీ మృతి తనను ఎంత కలచివేసిందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైట్లీ.. గొప్ప న్యాయవాది, అనుభవజ్ఞుడైన పార్లమెంట్ సభ్యుడు, దేశ నిర్మాణంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు కోవింద్.
తీరని లోటు..
అరుణ్ జైట్లీ మృతి దేశానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జైట్లీని శక్తిమంతమైన మేధావి, సమర్ధుడైన పాలనాధికారిగా అభివర్ణించారు వెంకయ్య. తనకు దీర్ఘకాల మిత్రుడు, అత్యంత సన్నిహితుల్లో జైట్లీ ఒకరని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుడిని కోల్పోయా...
అరుణ్ జైట్లీ మృతి ఎంతో బాధ కలిగించిందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. సీనియర్ పార్టీ నాయకుడినే కాక, తనకు ఎప్పుడూ మార్గదర్శకుడిగా ఉన్న కుటుంబ సభ్యుడిని కోల్పోయానన్నారు షా.
దేశానికే ఆస్తి జైట్లీ..
అరుణ్ జైట్లీ మృతిని తీరని లోటుగా పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆయనను దేశానికి, పార్టీకి గొప్ప ఆస్తిగా అభివర్ణించారు. జైట్లీ మృతి వార్త తెలియగానే లఖ్నవూ నుంచి దిల్లీకి బయలుదేరి వెళ్లారు.
విపక్ష నేతలు...
జైట్లీ మృతి పట్ల విపక్ష నేతలు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:- ఆఖరి క్షణం వరకు కాషాయ సైనికుడిగానే సేవలు...