పాకిస్థాన్‌తో యుద్ధం ఎప్పుడు వస్తుందో అంచనా వేయడం చాలా కష్టమని, అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రక్షణదళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నారు త్రిదళాధిపతి బిపిన్ రావత్.
తమిళనాడు తంజావూరులోని 'టైగర్‌షార్క్స్' వైమానిక స్థావరం వేదికగా వాయు దళాధిపతి ఆర్కేఎస్ బదౌరియాతో కలిసి సుఖోయ్-30 ఎంకేఐ కొత్త స్క్వాడ్రన్‌ను ప్రారంభించారు రావత్. దక్షిణ భారతంలో తొలిసారి మోహరించిన సుఖోయ్ 30 ఎంకేఐ శ్రేణి యుద్ధవిమానాలు గగనంతో పాటు సముద్రతలాన్ని పర్యవేక్షించనున్నాయని తెలిపారు.
త్రివిధ దళాలన్ని కలిపి సంయుక్త దళంగా ఏర్పాటు చేసే అంశమై సూచనాప్రాయంగా స్పందించారు రావత్. సంయుక్త దళ నిర్మాణంలో మనదైన విధానాన్ని అవలంబిస్తామన్నారు.
హిందూ మహాసముద్రంలో చైనా జాడపై
హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాల విస్తరణపై స్పందించారు రావత్. ప్రతి దేశం వారి భద్రతపై చర్యలు తీసుకుంటుందన్నారు. చైనా కార్యకాలాపాలను ఆ కోణంలోనే చూడాలన్నారు. ఏ దేశమైనా ఒక ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తుంటే అక్కడ తమ పట్టును పెంచుకునేందుకు యత్నిస్తోందని భావించాలని పేర్కొన్నారు.
అయితే భారత ప్రాదేశిక జలాల రక్షణలో భారత నౌకాదళం సమర్థంగా పనిచేస్తుందన్నారు. ఉన్నత శ్రేణి సుఖోయ్ విమానాలు హిందూ మహాసముద్రంలో భారత్‌కు కీలకం కానున్నాయని అభిప్రాయపడ్డారు రావత్.
"భారత నౌకాదళం చాలా సమర్థమైంది. మన ప్రాదేశిక జలాల రక్షణను చేపడుతోంది. ఈ దక్షిణ భారత వైమానిక స్థావరం భారత నౌకాదళానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.
సంయుక్త దళాల దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాం. అయితే ఈ సంయుక్త దళం రూపొందించేందుకు త్రివిధ దళాలతో కలిసి పనిచేస్తున్నాం. మేం ఏ దేశానికి చెందిన రక్షణ విధానాన్ని అనుసరించబోం. భారత్‌కు మనదైన అత్యున్నత యంత్రాంగాన్ని తయారుచేసేందుకు యత్నిస్తున్నాం. అయితే అది భారత్‌కు నప్పుతుందో లేదో చూడాలి."
-బిపిన్ రావత్, త్రిదళాధిపతి
ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం