ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాలు ప్రకృతి అందాలతో పాటు ఎన్నో ఔషధ మూలికలకు నెలవు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేసే గుణం అక్కడ లభించే ఔషధాల్లో ఉంది. ప్రధానంగా ఇక్కడ లభించే బద్రీ బెర్రీ అనే ఔషధ మూలికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్యాన్సర్, కిడ్నీలో రాళ్లు, మధుమేహం, రక్తపోటు, లివర్ సమస్యల వంటి అనేక రోగాలకు దివ్య ఔషధంగా.. సాగు చేసే వారికి బద్రీ బెర్రీ ఉపాధిగా మారింది.
హిమాలయ పర్వతాల్లో లభించే మూలికలపై ప్రధాని మోదీ కూడా ఎన్నో సార్లు తన ప్రసంగాల్లో ప్రస్తావించారు. 2018 పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా ఉత్తరాఖండ్‌లో పర్యటించిన మోదీకి ఈ మొక్క నుంచి సేకరించిన 1.5 లీటర్ల రసాన్ని అందజేశారు స్థానికులు. బద్రీ బెర్రీ నూనెను లీటరు ధర రూ.1000 చొప్పున విక్రయిస్తుంటారు.
ఎత్తైన హిమాలయాల్లో మాత్రమే పెరిగే సామర్థ్యం ఉన్న ఈ మొక్కల పెంపకం.. స్థానికులకు గణనీయమైన ఆదాయం తెచ్చిపెడుతోంది.
"నేను 28ఏళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నా. ఒకప్పుడు మా వద్దకే దుకాణదారులు, సామాన్యులు వచ్చేవారు. వ్యాపారం బాగా సాగేది. ఇప్పడు ఈ వృత్తిలోకి ఎక్కువ మంది రావడం వల్ల ఆదాయం తగ్గి, వ్యాపారం దెబ్బతింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కొన్ని ఔషధాల మేళాల వల్ల వ్యాపారం కాస్త గిట్టుబాటు అవుతోంది."
-కిషన్ బోనాలి, వ్యాపారి
బద్రీ బెర్రీ ఔషధాన్ని గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నగరాల్లో ఈ మూలిక ఇప్పటికీ ప్రాచుర్యం పొందలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ మూలికల గొప్పతనం గురించి నగరవాసులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు డాక్టర్లు.