దేశంలో మహిళలపై వరుస అత్యాచారాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిస్సహాయులైన మహిళలు, యువతులపై క్రూరమృగాళ్ల లైంగిక వేధింపులకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు ఇటీవల ప్రతిరోజు బయటపడుతున్నాయి. దేశమంతా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. అదే రాష్ట్రానికి చెందిన ఓ భాజపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తమ కూతుళ్లకు విలువలు నేర్పితేనే అత్యాచారాలకు అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్యానించారు.
హాథ్రస్ సామూహిక అత్యాచార ఘటనపై స్పందించమని విలేకరి కోరగా.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బల్లియా నియోజకవర్గ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్.
"ఇలాంటి ఘటనలను సంస్కారంతోనే అదుపు చేయగలం. చట్టాలు, ఖడ్గాలతో వీటిని ఆపలేం. తమ కూతుళ్లను సంస్కారవంతమైన వాతావరణంలో పెంచి, వారికి మర్యాదగా ప్రవర్తించడం నేర్పించడం తల్లితండ్రుల ధర్మం. రక్షణ కల్పించడం ప్రభుత్వాల ధర్మమైతే, పిల్లలకు మంచి విలువలు నేర్పించడం కుటుంబ ధర్మం. మంచి విలువలు, ప్రభుత్వం కలిస్తేనే దేశాన్ని సుందరంగా మార్చగలం."
-సురేంద్ర సింగ్, భాజపా ఎమ్మెల్యే
హాథ్రస్లో 19 ఏళ్ల యువతి అత్యాచారానికి గురై.. చికిత్స పొందుతూ దిల్లీ సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో సెప్టెంబర్ 29న మరణించింది. నలుగురు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది యూపీ సర్కార్.
ఇదీ చదవండి- హాథ్రస్ బాధితురాలి కుటుంబం 5 డిమాండ్లు