కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత భూభాగంలోకి 1,200 కిలోమీటర్ల దూరం చైనా చొరబడిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
బిహార్‌లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న రాజ్‌నాథ్.. విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"కొన్ని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ అంటున్నారు. కానీ నిజమేంటంటే.. దేశ గౌరవం కాపాడేందుకు మన సైనికులు శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు. బాలాకోట్‌పై వాయుదాడులకు సంబంధించి వాళ్లు ఆధారాలు కోరారు. పుల్వామాలో పాక్ పాత్రపై ఆ దేశ మంత్రి ఫవాద్ చౌధురి ప్రకటన చేశారు. ఇప్పటికైనా ఈ విషయంలో కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
రాహుల్ ఆరోపణలు..
పంజాబ్‌లో గతవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ ఆరోపించారు. 1,200 కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు భారత్ అప్పగించిందన్నారు.
దీనిపై స్పందించిన రాజ్‌నాథ్.. భారత్ నుంచి ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణ జరగలేదని స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో కాంగ్రెస్ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదన్నారు.
ఫవాద్ ప్రకటన..
జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్ నేత ఫవాద్ పార్లమెంటు సాక్షిగా అంగీకరించారు. పైగా పిరికిపందలా దాడి చేయడాన్ని తమ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో సాధించిన ఈ విజయంలో మనమంతా భాగస్వాములేనని అన్నారు.
ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావటం వల్ల ఫవాద్ మళ్లీ మాట మార్చారు. తాను ప్రస్తావించింది పుల్వామా దాడి తర్వాత విషయాల గురించి అంటూ బుకాయించారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పారు.
ఇదీ చూడండి: 'నిరుద్యోగం గురించి మోదీ ఎందుకు మాట్లాడరు?'