అయోధ్య రామ మందిర నిర్మాణానికి అవసరమయ్యే రాతి తవ్వకానికి రాజస్థాన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భరత్‌పుర్ జిల్లాలోని బంద్ బరేతా అభయారణ్యంలో తవ్వకాలు జరిపేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.
చాలా ఏళ్లుగా రామ మందిరాల నిర్మాణం కోసం.. భరత్‌పుర్‌లోని బన్సి పహార్పుర్ గులాబీ ఇసుకరాయిని వాడుతున్నారు. టన్నుల కొద్ది రాయి ఇక్కడి నుంచి తరలిపోయింది. అయితే.. ఇక్కడ మరిన్ని తవ్వకాలు జరిపితే అరుదైన గులాబీ ఇసుకురాయి హరించుకుపోతుందని ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో అన్ని విధాలా అలోచించి.. బంద్ బరేతా అభయారణ్యంలో తవ్వకాలకు సుముఖం వ్యక్తం చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. కానీ, అనుమతుల్లో ఆలస్యం ఏర్పడింది. అయితే.. టెక్నికల్ సమస్య వల్లే ఈ జాప్యం జరిగిందని విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ఓ నేత తెలిపారు. ప్రస్తుతం ఈ సమస్య తీరిపోయిందని చెప్పారు.
"రాతి సరఫరా విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం ఎన్నడూ ఇబ్బందులు కలిగించలేదు. అటవీ శాఖలో నెలకొన్న సాంకేతిక సమస్యల తోనే రాతి సరఫరాలో ఆటంకం ఏర్పడింది. రాజస్థాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరిస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏ సర్కారు ఉన్నా రామ మందిర నిర్మాణాన్ని ప్రోత్సాహించింది."
-- త్రిలోక్‌నాథ్, విశ్వ హిందూ పరిషత్ నేత.
బంద్ బరేతా అభయారణ్యంలో మైనింగ్ అనుమతుల విషయంలో ప్రాథమిక చర్యలను ప్రారంభించినట్లు భరత్‌పుర్ జిల్లా కలెక్టర్ నాథ్మాల్ దిదెల్ తెలిపారు. ఆ ప్రాంతంలో అధికారులు సర్వే చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే తవ్వకాలు జరుపుకోవచ్చని అన్నారు.
ఇదీ చూడండి:అమరుడైన 18 ఏళ్లకు ఆ జవాన్ భార్యకు పరిహారం!