కరోనా వైరస్ పరీక్ష ఫలితాలను వేగంగా ఇస్తాయని భావిస్తున్న రాపిడ్ టెస్టింగ్ కిట్ల వినియోగంపై నిషేధం విధించింది రాజస్థాన్. ఈ కిట్ల ద్వారా కచ్చితమైన ఫలితాలు రాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలికి(ఐసీఎంఆర్) సమాచారం ఇచ్చింది.
రాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా 90 శాతం కచ్చితమైన ఫలితాలు వెలువడతాయన్న అంచనాలు ఉన్నాయని పేర్కొంది ప్రభుత్వం. అయితే అంచనాలకు భిన్నంగా వీటి ద్వారా 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని స్పష్టం చేసింది. జైపుర్ ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా నిపుణుల కమిటీ పరీక్ష కిట్ల కచ్చితత్వాన్ని పరిశీలించింది. ఈ కమిటీ సూచనల మేరకు కిట్ల వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.
"ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచన మేరకు మేం రాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించడం ఆపేశాం. ఈ అంశమై ఐసీఎంఆర్‌కు లేఖ రాశాం. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది. ఐసీఎంఆర్ నిర్ణయం మాకు అనుకూలంగా వస్తే కిట్లను వెనక్కి పంపించే అవకాశం ఉంది."
-ప్రభుత్వ ప్రకటన
ఈ కిట్ల ద్వారా ఇప్పటికే 168 పరీక్షలు చేశామని వెల్లడించింది ప్రభుత్వం. కరోనా బాధితులకు ఈ టెస్టింగ్ కిట్లద్వారా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. అయితే వారికి వైరస్ నెగిటివ్‌గా తేలిందని పేర్కొంది.
బంగాల్లో..
బంగాల్‌లోనూ రాపిడ్ టెస్ట్ కిట్లు సరిగా పనిచేయడం లేదని సోమవారం ఆరోపణలు చేసింది అక్కడి ప్రభుత్వం. వాటి విశ్వసనీయతపై అనుమానాలు లేవనెత్తింది.
ఇదీ చూడండి: విస్తృత పరీక్షలే కరోనా కట్టడికి శరణ్యం!