పౌరసత్వ చట్ట సవరణను (సీఏఏ) రద్దుచేయాలని విజ్ఞప్తి చేస్తూ రాజస్థాన్ శాసనసభ తీర్మానం చేసింది. మూజువాణి ఓటు ద్వారా ఈ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన భాజపా... కాంగ్రెస్ కేవలం రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించింది.
"పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. పౌరసత్వం ఇవ్వడంలో మతం ప్రాతిపదికన ఎలాంటి వివక్ష ఉండకూడదు. చట్టం ముందు అందరికీ (అన్ని మతాలవారికి) సమాన అవకాశాలు ఉండాలి. అందుకే సీఏఏను వెనక్కి తీసుకోవాలని.. భారత ప్రభుత్వాన్ని కోరాలని సభ నిర్ణయించింది."
- శాంతి ధరివాల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
పంజాబ్ తరువాత ఇటువంటి తీర్మానాన్ని ఆమోదించిన రెండో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. అంతకు ముందు కేరళ అసెంబ్లీలో కూడా అధికార వామపక్ష కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సంయుక్తంగా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించాయి.
ఎన్పీఆర్ ఉపసంహరించుకోవాలి..
2020లో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) నవీకరణలో భాగంగా కొత్తగా చేర్చిన సమాచార వివరాల సేకరణను కూడా ఉపసంహరించుకోవాలని రాజస్థాన్ అసెంబ్లీ కోరింది.
ఇదీ చూడండి: స్మార్ట్ఫోన్ విపణిలో అమెరికాను దాటేసిన భారత్