భారత పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతున్నారు. రాజస్థాన్ ఆల్వార్ జిల్లాలోని ఓ కుటుంబం ఆయనపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటిచెప్పింది. అభినందన్ సాహసాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా తమ కుటుంబంలో పుట్టిన చిన్నారి బాబుకు 'అభినందన్' అని పేరు పెట్టుకుంది.
ఆల్వార్‌లోని కిషన్గార్బాస్ ప్రాంతానికి చెందిన సప్నాదేవి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలోనూ ఆ కుటుంబం మొత్తం అభినందన్‌కు సంబంధించిన వార్తలు చూస్తూనే గడిపారు. కొడుకు పుడితే ఆ సైనిక వీరుడి పేరు పెట్టుకుందామని నిర్ణయించుకున్నారు.
'భారత పైలట్' సాహసాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా నా కుమారుడికి 'అభినందన్' అని పేరు పెట్టుకున్నాను. తను పెద్దవాడయ్యాక సైనిక వీరుడు అభినందన్‌లా ధైర్యవంతమైన సైనికుడుగా ఎదగాలని కోరుకుంటున్నాను." -సప్నా దేవి, బాలుని తల్లి
ఇదీ జరిగింది
పుల్వామా ఘటన జరగడం, మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతో భారత్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైష్ ఉగ్రవాద సంస్థ శిబిరాలపై దాడి చేసింది. దీనికి ప్రతిస్పందనగా పాక్ భారత భూభాగంపై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిని భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది.
సాహస వర్థమాన్
భారత్ పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ తన 'మిగ్-21 బైసన్'తో పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చారు. అనంతరం మిగ్ ధ్వంసం కావడం వల్ల పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపై పారాషూట్‌తో దిగారు. స్థానికులు అభినందన్‌పై దాడిచేశారు. తరువాత పాక్ సైన్యం అతనిని అదుపులోకి తీసుకుంది. ఇంత జరిగినా అభినందన్ మొక్కవోని ధైర్యంతో దృఢచిత్తంతో ఉన్నారు. కేవలం తనపేరు, సర్వీసు నెంబర్, వ్యక్తిగత వివరాలు తప్ప దేశ రక్షణకు సంబంధించి ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.
భారత దౌత్యం, ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్ జెనీవా ఒప్పందాలను అనుసరించి అభినందన్‌ను విడిచిపెట్టింది. సైనిక వీరుడు వాఘా సరిహద్దుల నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. భారతీయులంతా అతనికి ఘన స్వాగతం పలికారు.