కేరళ, కర్ణాటకల్లో వరద బీభత్సానికి మరణించిన వారి సంఖ్య 163కు చేరింది. మరో 50 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. మరోవైపు కర్ణాటక తీర, దక్షిణాది ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి.
ఈ రాష్ట్రాలకు చెందిన సుమారు 6 లక్షల మంది నిరాశ్రయులు 2 వేల పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
కేరళలో
రాష్ట్రంలో జల విలయంలో చిక్కుకుని 102 మంది మరణించారని కేరళ ప్రభుత్వం తెలిపింది. 1,89,649 మందిని 1,119 పునరావాస కేంద్రాలకు తరలించామని స్పష్టం చేసింది.
నైరుతి దిశ నుంచి కేరళ తీరం వెంబడి 45-55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు సూచించింది.
తక్షణ సాయం రూ.10 వేలు
వరద బాధితులకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.4 లక్షలు.... పూర్తిగా ఇళ్లు, భూమి కోల్పోయిన వారికి రూ.10 లక్షలు పరిహారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
ఆర్బీఐ గవర్నర్‌కు రాహుల్ లేఖ
వరదల ప్రభావంతో సర్వం నష్టపోయిన రైతులకు ఉపశమనం కలిగించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ... ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు లేఖ రాశారు. రైతులు పంట రుణాలు తీర్చడానికి 2019 డిసెంబర్ 31 వరకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు రాహుల్‌గాంధీ .
కర్ణాటకలో
కర్ణాటకలో వరదలకు మృతుల సంఖ్య 61కు చేరుకుంది. మరో 15 మంది ఆచూకీ గల్లంతైంది. సుమారు 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే రాష్ట్రంలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 22 జిల్లాల్లోని 103 తాలూకాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపాయని కర్ణాటక ప్రభుత్వం ప్రకటిచింది. 4.69 లక్షల హెక్టార్ల పంట భూమి నీట మునిగిందని స్పష్టం చేసింది.
వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రోడ్లు, పాఠశాలలు లాంటి మౌలిక సదుపాయల పునరద్ధరణ చేపట్టారు. ముఖ్యమంత్రి సహాయక నిధికి రూ.4.09 కోట్ల నిధులు సమకూరాయి.
ఇదీ చూడండి: అడ్వాణీకి జ్వరం... స్వాతంత్ర్య వేడుకలకు దూరం