కుండపోత వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగి పడి వందాలాది మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. ఉత్తరాదిన వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరింది. పంజాబ్, హరియాణా, జమ్ములో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
హిమాచల్ ప్రదేశ్...
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. మరో 24 గంటలపాటు అనేక చోట్ల కుంభవృష్టి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సట్లేజ్ నది ప్రవాహ ఉద్ధృతికి సిమ్లాలోని చాంబా ప్రాంతంలో ఓ వంతెన వరదలో కొట్టుకుపోయింది. కొండచరియలు విరిగిపడటం వల్ల కులు-మనాలి జాతీయ రహదారి ధ్వంసమైంది. కొండచరియలు విరిగిపడటం వల్ల నాలుగైదు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. వరదల ధాటికి రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 25కు పెరిగింది. మొత్తం 500 మంది వరకు వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్...
ఉత్తరాఖండ్‌లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో వరదల వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలాచోట్ల భారీ వర్షాలకు జనావాసాలు, పంటపొలాలు నీటమునిగాయి. మొత్తం మూడు చాపర్లు సహాయకచర్యల్లో పాల్గొన్నాయి. బాధితులకు ఆహార పొట్లాలు, మందులు జారవిడుస్తున్నారు. భారీవర్ష సూచనతో సోమవారం 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
దిల్లీ...
దిల్లీకి వరదముప్పు పొంచి ఉంది. యమునపై ఉన్న హత్నికుంద్ బ్యారేజీ నుంచి 8 లక్షల క్యూసెక్కులను హరియాణా ప్రభుత్వం దిగువకు విడుదల చేసింది. దిల్లీ పరిసరాల్లో యమునా నది ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం యమునా నదిలో నీటి ప్రవాహం 205 మీటర్లకు చేరింది.
లోహపూల్ మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపేశారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి వరద పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు.
పంజాబ్...
పంజాబ్‌లో భారీ వర్షాలకు ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గురుదాస్‌పూర్ జిల్లాలో బియాస్ నదిలో కొట్టుకుపోతున్న 9 మందిని విపత్తు నిర్వహణ దళం సురక్షితంగా కాపాడింది. పంజాబ్‌లో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం అమరీందర్ సింగ్ సహాయ, పునరావాస చర్యలకు అత్యవసరసాయం కింద వంద కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
- ఇదీ చూడండి: రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఎన్నిక ఏకగ్రీవం