2017-18 సంవత్సరంలో భారతీయ రైల్వే ఆపరేటింగ్ నిష్పత్తి అధ్వాన్నంగా ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) నివేదిక వెల్లడించింది. గత పదేళ్లలో రైల్వేశాఖ పరిస్థితి ఇంత అధ్వానంగా ఎన్నడూ లేదని కాగ్ తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను సోమవారం పార్లమెంట్‌కు కాగ్ అందజేసింది.
రూ.100కి రూ.98.44 ఖర్చు
2017-18 సంవత్సరంలో ఆపరేటింగ్ నిష్పత్తి 98.44శాతం ఉందని పేర్కొంది. అంటే రూ.100 రాబట్టుకునేందుకు రూ.98.44 ఖర్చు పెట్టిందని వెల్లడించింది. ఖర్చు, ఆదాయం మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉందనేది ఈ ఆపరేటింగ్ నిష్పత్తి ద్వారా తెలుస్తుంది. ఈ కాలంలో రూ.1,665.61కోట్ల లాభంలో ఉండాల్సిన రైల్వేశాఖ రూ.5,676.29కోట్ల నష్టాల్లో ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది.